ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 9 :
సభల్లో బిసి రిజర్వేషన్లు విషయం లో ప్రజా ప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి ఆరోపించారు.దేశానికి పట్టుకొమ్మలైన, మెజారిటీ జనాభా కలిగిన బీసీల జీవితాలు ఏడున్నర దశాబ్దాలు గడిచినా నేటికీ దయనీయంగానే ఉన్నాయి. ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకీలు మోసే బోయీలుగా, రాజకీయ బానిసలుగా బీసీలు మిగిలిపోవడం అత్యంత బాధాకరం.బీసీల ఓట్లతో గెలిచి, ఏసీ కార్లలో తిరుగుతూ, ఏసీ అసెంబ్లీలు, పార్లమెంటులో కూర్చుంటున్న ఎంతోమంది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. తమ స్వార్థం, కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. దీనివల్ల నిరాశ చెందిన ప్రజల్లో, “బీసీ నాయకుల కంటే ఓసీ పార్టీలే మెరుగైన పాలనను అందిస్తాయేమో” అనే భావన బలంగా నాటుకుంటోంది. అయితే, అన్ని ఓసీ పార్టీలు ఒకేలా ఉండవని, బీసీలకు నిజంగా పెద్దపీట వేసే పార్టీలను కూడా సమాజం గుర్తించాలని రామకోటి విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రికి మా విజ్ఞప్తి:
ఒక్క సంతకంతో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదంపొందేలా చేస్తే, ఈ భూమి ఉన్నంతకాలం బీసీలు మిమ్మల్ని కీర్తిస్తారు. రేపు పదవుల నుంచి తప్పుకున్నాక, మీ హయాంలో బీసీల కోసం ఏం చేశారనే ప్రశ్న ఎదురుకాకుండా, బీసీలకు ఆత్మగౌరవాన్ని అందించిన నాయకునిగా మీరు చరిత్రలో నిలిచిపోతారన్నారు.















