ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 25
__________________________________
రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యలను పకడ్బందీగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రోడ్డు, రైల్వే భద్రతతో పాటు సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం “ట్రాఫిక్, రోడ్, రైల్ సేఫ్టీ బ్యూరో”ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభాగాన్ని ప్రత్యేకంగా TG-TMARSగా (Telangana Traffic Management and Road Safety) ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ కొత్త బ్యూరోకు ఏడీజీపీ (ADGP) లేదా ఐజీ (IG) స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, నిబంధనల అమలు (Enforcement) ఈ విభాగానికే అప్పగించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ లపై నిరంతరం విధుల్లో ఉండేలా ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉండనున్నాయి.
కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు నిర్వహించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించిన వేగం (ఓవర్ స్పీడింగ్) వంటి ముప్పు కలిగించే ఉల్లంఘనలపై నిరంతర నిఘా ఉంచుతారు. ఈ పర్యవేక్షణను జిల్లా స్థాయికి విస్తరిస్తూ, ప్రతి జిల్లాకు ఒక అదనపు ఎస్పీ స్థాయి ట్రాఫిక్ పోస్టును కేటాయించడమే కాకుండా, ప్రాథమికంగా ట్రాఫిక్ విభాగం నుంచి 300 మంది సిబ్బందిని ఈ కొత్త బ్యూరో పరిధిలోకి బదిలీ చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బందిలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు బాడీ వోర్న్ కెమెరాలు సమకూర్చనున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందికి అత్యాధునిక శిక్షణ, అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా “రాష్ట్ర ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీ”ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గి, ప్రయాణాలు మరింత సురక్షితం కానున్నాయి.















