EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 6:

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటానికి మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, PM విశ్వకర్మ యోజన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు మరియు సరఫరాల శాఖ మంత్రిగా సేవలందించిన మహోన్నత నాయకుడని అన్నారు. దేశ సమగ్రత, జాతీయవాదం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా, భారతీయ జనసంఘ్‌ను స్థాపించి దేశ రాజకీయాలకు జాతీయవాద దిశను చూపిన దార్శనికుడిగా ఆయనను కొనియాడారు

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన విధానాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని, “ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు” అనే నినాదంతో దేశ ఏకత్వం కోసం ఉద్యమించారని తెలిపారు. ఆ ఉద్యమంలో భాగంగా జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లిన సమయంలో అరెస్టై, 1953 జూన్ 23న నిర్బంధంలోనే ఆయన ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి చిరకాల సంకల్పాన్ని సాకారం చేసిందని, ఇది దేశ ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసిన చారిత్రాత్మక నిర్ణయమని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి దేశభక్తి, త్యాగం, జాతీయ సమగ్రత పట్ల ఉన్న అంకితభావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను ఆచరణలో కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top