ఈతరం భారతం హైదరాబాద్ జూలై 24
మారుతున్న శీతోష్ణస్థితి మార్పులు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరికొత్త సవాళ్లను విసిరేలా ఉన్నాయి. భారత దేశంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే కీలక ఆహార పంట అయిన కంది సాగును ‘గ్రీన్ ప్లేగు’గా పిలిచే ఒక భయంకరమైన వైరల్ వ్యాధి తీవ్రంగా ముంచెత్తే ప్రమాదం ఉందని హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పరిశోధకులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ వ్యాధి విస్తరణ కొత్త ప్రాంతాలకు మారినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం మాత్రం అత్యంత తీవ్రమైన ప్రమాదకర జోన్‌గానే కొనసాగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది
‘పిజియన్‌పీ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్’ (పీపీఎస్‌ఎమ్‌డీ) అనే వైరల్ వ్యాధి వల్ల కంది పంటకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ వ్యాధిని వ్యవసాయ రంగంలో ‘గ్రీన్ ప్లేగు’ అని వ్యవహరిస్తారని పరిశోధకులు తెలిపారు. పంట తొలి దశలోనే ఈ చీడ పడితే.. ఏకంగా 90 శాతానికి పైగా దిగుబడి నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు. ‘పిజియన్‌పీ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్’ వల్ల వ్యాపించే ఈ తెగులును ‘అసేరియా కజాని’ అనే నల్లి జాతి కీటకంగా వర్ణించారు. ఒక మొక్క నుంచి మరో మొక్కకు ఈ తెగులు వ్యాప్తిస్తుంది. ఈ వ్యాధి సోకిన కంది మొక్కలు లేత ఆకుపచ్చ రంగులోకి మారి, ఆకులు చిన్నవిగా అయిపోయి గుబురుగా తయారవుతాయన్నారు. అంతిమంగా పూత, కాయ కాయకుండా పంట పూర్తిగా ఎండిపోతుందన్నారు.















