ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 27 :
_________________________________
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సమత, తదితర ముఖ్య నాయకులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీని ‘తెలంగాణ ఉక్కు మనిషి’గా అభివర్ణించారు. రజాకార్ల దౌర్జన్యాలను అంతమొందించేందుకు కోఠి వద్ద నిజాంపై బాంబులు విసిరిన నారాయణరావు పవార్, గండయ్య వంటి విప్లవకారులకు సోలాపూర్‌లో తన సొంత ఖర్చులతో ఆయుధ శిక్షణ (ఆర్మ్డ్ ట్రైనింగ్) ఇప్పించిన ఘనత బాపూజీకే దక్కుతుందని గుర్తుచేశారు. స్వతహాగా న్యాయవాది అయిన బాపూజీ, తన యావదాస్తిని తెలంగాణ ఉద్యమం కోసం ధారపోశారని తెలిపారు. మలిదశ ఉద్యమానికి నాంది పలికిన చారిత్రక ‘జలదృశ్యం’ ఆయన నివాసమేనని, అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ఊపిరిపోసుకుందని పేర్కొన్నారు. 96 ఏళ్ల వృద్ధాప్యంలో సైతం ఢిల్లీలోని ఎముకలు కొరికే చలిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరసన దీక్ష చేపట్టిన నిత్య విప్లవకారుడని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఉద్యమ ద్రోహులపై బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని ఎంతోమంది పదవులు, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని..కానీ ఉద్యమం కోసం తన పదవులను, సొంత ఆస్తులను పోగొట్టుకున్న ఏకైక మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూడాలనే ఆయన చివరి కోరిక నెరవేరకుండానే పరమపదించడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాపూజీ ఆశయాలకు అనుగుణంగా చేనేత, కులవృత్తుల సొసైటీలను బలోపేతం చేస్తామని, పాఠ్యాంశాల్లో బాపూజీ జీవిత చరిత్రను చేర్చి ఆయన త్యాగాలను భావితరాలకు తెలిసేలా గౌరవిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















