EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్ర‌తి పిల్ల‌వాడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరేలా ప‌ని చేయాలి : స‌మాజ మార్పున‌కే విద్యా శాఖ బాధ్య‌త‌లు 

ఈతరం భారతం హైద‌రాబాద్‌ జులై 30 :

నాణ్య‌మైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంత‌స్తుల్లాంటివ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లు ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందిస్తామ‌నే దీక్ష‌ను ఉపాధ్యాయులు తీసుకోవాల‌ని సూచించారు. టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌” కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఎంసీహెచ్ఆర్డీలో గురువారం స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై స‌గ‌టున రూ.1.08 ల‌క్ష‌లు వ్య‌యం చేస్తున్నామ‌ని, దానిని వారి అభివృద్ధికి పెట్టే పెట్టుబ‌డిలా చూడాల‌న్నారు. అంత మొత్తం ఖ‌ర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాల‌న్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాల‌తో కూడిన విద్యా వ్యవస్థ ఉండాల‌నే లక్ష్యంతోనే ఉపాధ్యాయుల‌ను విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు పంపుతున్నామ‌ని తెలిపారు. ఆయా దేశాల్లో ప‌ర్య‌టించి వ‌చ్చిన ఉపాధ్యాయులు అక్క‌డి అనుభ‌వాల‌ను ఇక్క‌డ ఆచ‌ర‌ణ‌లో తీసుకురావాల‌ని సూచించారు. వివిధ దేశాల ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం ఎటు వెళుతుందో తెలుస్తుంద‌ని.. ప‌ర్య‌ట‌న‌తో తెలుసుకున్న అంశాల‌ను ఇక్క‌డ విద్యార్థుల‌కు బోధించి వారిని ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా తీర్చిదిద్దాల‌ని ఉపాధ్యాయుల‌కు సూచించారు.

ఆస్తులు లేక‌పోవ‌డం వెనుక‌బాటుత‌నం కాద‌ని, విద్య లేక‌పోవ‌డ‌మే వెనుక‌బాటుత‌న‌మ‌ని తాము నిర్వ‌హించిన సామాజిక‌, ఆర్థిక‌, విద్యా, ఉపాధి, కుల స‌ర్వే తేల్చింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక‌రాల కొద్ది భూమి, ఇత‌ర ఆస్తులు ఉన్నా స‌మాజం ఎటు వెళుతుందో తెలియ‌క వెనుక‌బ‌డి పోతున్నార‌ని, ఏ ఆస్తులు లేక‌పోయినా చ‌దువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్ర‌పంచంతో పోటీ ప‌డుతున్నార‌ని తెలిపారు.

ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందించాల‌నే ల‌క్ష్యంతోనే బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక హాస్ట‌ల్ విద్యార్థుల‌కు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామ‌న్నారు. 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్టామ‌ని, ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప్ర‌మోష‌న్లు ఇచ్చామ‌ని సీఎం గుర్తు చేశారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మాదిరే ప్ర‌తి ఏటా 10 నుంచి 15 మంది ఉపాధ్యాయుల‌ను విదేశీ విద్య‌కు పంపిస్తామ‌ని సీఎం తెలిపారు. అక్క‌డ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్క‌డ విద్యార్థుల‌కు పంచాల‌ని సూచించారు.

ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను పాటుప‌డ‌తాన‌ని, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల‌ స‌మ‌స్య‌లపై త‌న‌తో కొట్లాడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉపాధ్యాయులు ఏ మండ‌లానికి ఆ మండ‌లం యూనిట్‌గా తీసుకొని, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం సూచించారు. ఆ మండలంలోని పాఠ‌శాల‌ల్లో ఏ వ‌స‌తులు కావాలి, ఎంత మంది ఉపాధ్యాయులు కావాలి, మెరుగైన విద్యా బోధ‌న‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఏమిటి? ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పిల్ల‌లు చేరేందుకు ఏం అవ‌స‌ర‌మ‌నే అంశాలు ఆ ప్ర‌ణాళిక‌లో ఉండాల‌ని సూచించారు. డిసెంబ‌రు నెలాఖ‌రుకు ఆ ప్ర‌ణాళిక త‌మ‌కు అంద‌జేస్తే దానికి అనుగుణంగా తాము కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేక వెబ్‌సైట్ రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయా మండ‌లాల‌ నుంచి వ‌చ్చే సూచ‌న‌లు, స‌ల‌హాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చాల‌ని సీఎం సూచించారు.

వ‌చ్చే అయిదేళ్ల వ‌ర‌కు విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించేందుకు ప్ర‌తి ఉపాధ్యాయుడు దీక్ష‌బూనాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దాల‌ని, సమాజం కోసం, తరతరాల భవిష్యత్ ను మార్చేందుకు అయిదేళ్ల పాటు పాటుప‌డేందుకు ప్ర‌తిజ్ఞ తీసుకోవాలని ఉపాధ్యాయుల‌కు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దే ల‌క్ష్యంతో ప‌ని చేయాల‌ని కోరారు.

త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉపాధ్యాయుల‌కు మొద‌టి తేదీనే వేత‌నాలు అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామ‌ని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. విద్య‌పై ఎంత మొత్త‌మైనా ఖ‌ర్చు చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. మానవ సంబంధాలను మెరుగుప‌ర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్ల‌లు మ‌న‌లోని మాన‌సిక ఒత్తిడిని దూరం చేస్తార‌ని అన్నారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అనుబంధాలు ఉన్న స‌మాజం, దేశ‌మే అభివృద్ధి చెందుతుంద‌ని, మాన‌వ సంబంధాలు లేని దేశాలు అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించ‌వ‌ని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు రోజులో అధిక స‌మయం పాఠశాల‌ల్లోనే ఉంటార‌ని, వారికి మాన‌వ సంబంధాల ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ఉపాధ్యాయుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు.

విద్య నైపుణ్యం కాద‌ని, విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్ ఒక భాష మాత్ర‌మేన‌ని, భాష స‌మాచార మార్పిడికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, నైపుణ్యం జీవ‌నోపాధి క‌ల్పిస్తుంద‌న్నారు. చైనా, జ‌పాన్‌, కొరియా, జ‌ర్మ‌నీ దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు 10 శాతం మించి ఉండ‌ర‌ని, కానీ వారికున్న నైపుణ్యంతో ప్ర‌పంచాన్ని శాసిస్తున్నార‌ని తెలిపారు.

జ‌పాన్‌, జ‌ర్మ‌నీ, కొరియా భాష‌లు కొంత నేర్చుకొని నైపుణ్యాలు నేర్చుకుంటే అక్క‌డ మంచి ఉపాధి అవ‌కాశాలు పొంద‌వ‌చ్చ‌న్నారు. 12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాల‌ని, ఆ అవగాహ‌న పెంపొందించాల్సిన బాధ్య‌త ఉపాధ్యాయుల‌పైన ఉంద‌ని అన్నారు.

స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పుడు నిర‌క్ష‌రాస్య‌త‌, క‌ర‌వుకాటకాల‌తో దేశం స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్పుడు ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ విద్యా, నీటిపారుద‌ల రంగాల‌ను త‌న ప్రాధాన్యాంశాలుగా ఎంచుకొని ఆ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, యూనివ‌ర్సిటీలు, సాగు నీటి ప్రాజెక్టులు నెహ్రూ దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. నాడు వేసిన పునాదుల‌తో నేడు ప్ర‌తి తండా, గూడెంలోనూ పాఠ‌శాల‌లు ఏర్పాట‌య్యాయ‌ని, ప్ర‌తి ఒక్కరికీ విద్య అందుబాటులోకి వ‌చ్చింద‌ని తెలిపారు.

 

సాంకేతిక విప్లవంతో వైట్ కాల‌ర్ జాబ్‌లను మ‌నం అందిపుచ్చుకున్నామ‌ని, కానీ ఇప్పుడు ఆ జాబ్‌ల‌కు కాలం చెల్లింద‌న్నారు. జ‌పాన్‌, జ‌ర్మ‌నీ, ద‌క్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యాల‌కు డిమాండ్ ఉన్నందున, అక్క‌డి అవ‌స‌రాల‌కు తగిన‌ట్లు నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. అందులో భాగంగానే సంప్ర‌దాయ కోర్సుల‌తో ప్ర‌భావం కోల్పోయిన ఐటీఐల‌ను టాటా సంస్థ స‌హ‌కారంతో ఏటీసీలుగా ఆధునీక‌రించామ‌ని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఉట్నూరు ఏటీసీలో శిక్ష‌ణ పొందిన వారంతా టాటా సంస్థ‌లో ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యార‌ని సీఎం తెలిపారు.

క‌ర‌వు, కాటాకాలు, నిరక్ష‌రాస్య‌త‌లో కూరుకుపోయిన దేశాన్ని సాగు నీటి ప్రాజెక్టులు, విద్యాల‌యాల ఏర్పాటుతో సుభిక్ష‌మైన దేశంగా తీర్చిదిద్దిన నెహ్రూపైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని విమ‌ర్శించారు. పాకిస్థాన్‌ల‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్క‌లు చేసి, గ‌రిబీ హ‌టావో నినాదంతో ప‌ని చేసిన ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. స్వాతంత్య్రం వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి 2014 వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రులుగా చేసిన వారు రూ.51 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేస్తే, 2014 నుంచి 2026 వ‌ర‌కు 12 ఏళ్ల‌లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రూ.151 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

గోరంత ప‌నుల‌ను కొండంత చెప్పుకుంటున్నార‌ని, ఎన్నో యుద్దాలు, క‌లి,నిర‌క్ష‌రాస్య‌త‌ల‌ను అధిగ‌మించిన విజ‌యాల‌ను ఎలా ప్ర‌చారం చేయాల‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ బిడ్డ పి.వి.న‌ర‌సింహారావు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు స‌ర్వేలు గురుకుల పాఠ‌శాల‌ను ఏర్పాటు చేశార‌ని, త‌ర్వాత కాలంలో అదే న‌వోద‌య విద్యాల‌యాల‌కు, గురుకుల పాఠ‌శాల‌ల‌కు న‌మూనాగా నిలిచింద‌న్నారు. ఆ పాఠ‌శాల‌లో చ‌దువుకున్న వారు ఎంద‌రో ఉన్న‌త స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా వర్ణించార‌ని, నాడు నిర్మించిన నాగార్జున సాగర్‌, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ఫ‌లితంగానే తెలంగాణ‌లో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్ప‌త్తి సాధ్య‌మైంద‌న్నారు. 80 వేల పుస్త‌కాలు చ‌దివి క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు కూళేశ్వ‌రం అయింద‌ని విమ‌ర్శించారు.

ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడంతో స‌రిపెట్టుకోకుండా వారిని ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా తీర్చిదిద్దాల‌నేది త‌న ఆశ‌య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిప‌ల్లి వంటి మారుమూల ప‌ల్లె ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివిన తాను తెలంగాణ‌లోని 12 వేల ప‌ల్లెల్లోని పాఠ‌శాల పిల్ల‌లు ప్ర‌పంచంతో పోటీ ప‌డే స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నానని సీఎం అన్నారు.

కొంద‌రు విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల‌ని విమ‌ర్శిస్తున్నార‌ని, నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్ర‌మోష‌న్లు స‌క్ర‌మంగా చేప‌ట్టినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా? ఎందుకు తాను రాజీనామా చేయాలో వాళ్లు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు.

ఓట్ల కోసం, రాజకీయం కోసం తాను ప‌ని చేయ‌డం లేద‌ని సీఎం అన్నారు. ప్ర‌పంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ ప‌డాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. స‌మాజ మార్పున‌కే తాను విద్యా శాఖ బాధ్య‌తలు తీసుకున్నాన‌ని తెలిపారు. 2034 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని పున‌రుద్ఘాటించారు. నాణ్య‌మైన విద్య అందించేందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించాల‌ని కోరారు.

స‌మావేశానికి ముందు ఫిన్లాండ్‌, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్య‌మంత్రి వీక్షించారు. స‌మావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్ఆర్డీ డైరెక్ట‌ర్ శాంతికుమారి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top