ఈతనం భారతం హైదరాబాద్ జూలై 27
తెలంగాణలో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు కుటుంబ వివరాల ధ్రువీకరణను ఒకే వేదికపైకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ‘ఫ్యామిలీ రిజిస్టర్’ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రతి కుటుంబానికి ఒకే ప్రామాణిక కుటుంబ రికార్డు అందుబాటులోకి రానుంది. రేషన్ కార్డు డేటాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను ఒకే రిజిస్టర్‌లో నమోదు చేయనుంది.ఆ తర్వాత మీసేవా కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ప్రజలు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత కేవలం రెండు పని దినాల్లోనే సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర పౌర సేవల కోసం పదే పదే కుటుంబ వివరాలు సమర్పించాల్సిన అవసరం తగ్గనుంది.















