EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ముఖ్యమంత్రి వచ్చాడు..వెళ్ళాడు : ఉప్పల్ ప్రజలకు ఒరిగింది శూన్యం

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 10 :

ముఖ్యమంత్రి వచ్చాడు..వెళ్ళాడు కానీ ఉప్పల్ ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యం అని ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన ఉప్పల్ మాజీ శాసన సభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు.ఉప్పల్ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ రింగ్ రోడ్ లో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి ఉప్పల్‌కు వచ్చి వెళ్లారు. గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం వహించిన ఆయన, ముఖ్యమంత్రిగా ఉప్పల్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని, అభివృద్ధి పనులకు నిధులు ప్రకటిస్తారని, ఉప్పల్‌కు కొన్ని కీలక వరాలు అందిస్తారని భావించారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గానికి ఒరిగిందేమిటనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. ప్రజల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరాశపరిచిందన్నారు.

ఉప్పల్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం పోరాటం చేస్తున్నారు. అనేక ఉద్యమాలు, వినతిపత్రాలు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల పాలన పూర్తవుతున్నా ఉప్పల్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రకటించకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినా ఈ అత్యంత కీలకమైన విద్యా అవసరంపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం యువత, విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని దుయ్యబట్టారు.

అదేవిధంగా ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇప్పటికీ అద్దె భవనాల్లో, పరిమిత వసతులతో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొత్త భవనాల నిర్మాణానికి నిధులు ప్రకటిస్తారని, భూమి కేటాయిస్తారని, కనీసం శంకుస్థాపన అయినా చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఆశించారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రకటన లేకపోవడం బాధాకరం. విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఉప్పల్ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

ఉప్పల్ నియోజకవర్గం లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నారు. గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో అయినా బస్ టెర్మినల్‌కు నిధులు ప్రకటిస్తారని ఆశించాం. కానీ ఆ అంశంపై కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రజా రవాణా సౌకర్యాల విస్తరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఉప్పల్ బాగాయత్ భూముల సమస్య కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. భూ యజమానులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేయడంతో కొంత పురోగతి సాధించినప్పటికీ, అక్కడ మౌలిక వసతుల కల్పన, రహదారులు, డ్రైనేజీ, శ్మశాన వాటికలు, ఇతర ప్రజా సదుపాయాల ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అదే నిర్లక్ష్య ధోరణిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా కాలయాపన చేయడం సరైన విధానం కాదు.

ఉప్పల్ బాగాయత్ ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు, వారి సమస్యలను పరిష్కరించాల్సిన నాయకులు ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారు. భూములకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లేకపోవడం, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు

Related News

Select the Topic
Scroll to Top