ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 12
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం ‘సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర’ ప్రచార కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా, జాతర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రోచర్, వాల్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ ప్రచారం ద్వారా జాతర విశిష్టతను, ఏర్పాట్లను భక్తులకు తెలియజేయనున్నారు. ఈ మహా జాతర బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వారితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరై, జాతర విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది.
జాతర ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవే
జనవరి 28 (బుధవారం): సారలమ్మ, గోవిందరాజు మరియు పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు.
జనవరి 29 (గురువారం): చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి వస్తుంది. ఇది జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం.
జనవరి 30 (శుక్రవారం): భక్తులు అమ్మవార్లకు మొక్కులు (బంగారం/బెల్లం) చెల్లించుకునే ప్రధాన రోజు.
జనవరి 31 (శనివారం): అమ్మవార్ల వనప్రవేశం (తిరుగు ప్రయాణం)తో జాతర ముగుస్తుంది.















