EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 గ్రామ స్వరాజ్యానికి నిజమైన బలమిచ్చే చారిత్రాత్మక సంస్కరణ బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 19

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 గ్రామ స్వరాజ్యానికి నిజమైన బలమిచ్చే చారిత్రాత్మక సంస్కరణ అని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ్వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 అనేది కేవలం మరో చట్టం కాదు. ఇది గ్రామ స్వరాజ్యానికి జీవం పోసే సంస్కరణ. అవినీతికి చెక్ పెట్టే వ్యవస్థ. ప్రజాధనం ప్రజల చేతుల్లోకే చేరేలా చేసే బలమైన మార్గం. ఈ చట్టం ద్వారా గ్రామాలు, సర్పంచులు, వార్డు మెంబర్లకు కలిగే లబ్ధి ఏమిటో ప్రతి ఒక్క గ్రామస్తుడికి తెలియాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,700 గ్రామాలకు ఈ చట్టం ద్వారా వచ్చే మార్పు చేరాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు.

ఎంజిఎన్ఆర్ఈజిఏ పై ఖర్చు – నిజమైన గణాంకాలు :

ఎంజిఎన్ఆర్ఈజిఏ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ పథకం మీద ఖర్చు చేసిన మొత్తం రూ. 11 లక్షల 53 వేల కోట్లు. అక్షరాలా చెప్పాలంటే- పదకొండు లక్షల యాభై మూడు వేల కోట్లు. మొత్తం ఖర్చులో యూపీఏ ప్రభుత్వ కాలంలో (10 సంవత్సరాలు) ఖర్చు చేసింది కేవలం రూ. 2 లక్షల 13 వేల కోట్లు మాత్రమే. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 8 లక్షల 53 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి స్పష్టమైన నిదర్శనం.

కాంగ్రెస్ పాలనలో ఎంజిఎన్ఆర్ఈజిఏ గా– లోపాల వాస్తవం

ఎంజిఎన్ఆర్ఈజిఏ పథకంలో ఉన్న లోపాలు దేశ ప్రజలకు కొత్తవి కావు. గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఇవి అనుభవంలోకి వచ్చిన విషయాలేనన్నారు.ఫేక్ జాబ్ కార్డులు, ఫేక్ వర్కులు, లెక్కలకందని భారీ అవినీతి – ఇవన్నీ కాంగ్రెస్ పాలనలో సాధారణంగా మారాయి. పేదల కోసం వచ్చిందని చెప్పిన మన్రేగా పథకం మధ్యవర్తుల చేతుల్లో పడింది, కాంట్రాక్టర్లకు లాభంగా మారింది, కానీ గ్రామాలకు మాత్రం శాశ్వత ప్రయోజనం దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మన్రేగాను కరప్షన్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చిందన్నారు.

2014 తర్వాత మోదీ గారు తీసుకొచ్చిన కీలక సంస్కరణలు:

2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. మోదీ గారు ఎంజిఎన్ఆర్ఈజిఏ లో సంస్కరణల దిశగా కీలక అడుగులు వేశారు. ఆధార్ సీడింగ్ ద్వారా ఒకే వ్యక్తికి పది జాబ్ కార్డులు అనే పరిస్థితికి చెక్ పెట్టారు. నకిలీ లబ్ధిదారులను వ్యవస్థ నుంచి తొలగించారు. బీటీ – డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మధ్యవర్తులను తొలగించి, కూలీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేశారు. ఈ మార్పులతో వ్యవస్థలో పారదర్శకత వచ్చింది, అవినీతికి బ్రేక్ పడింది, బాధ్యత అనే భావన ఏర్పడిందన్నారు.

కానీ అసలు ప్రశ్న – గ్రామాలకు నిజంగా ఏమి లభించింది?

దేశంలో సుమారు 2 లక్షల 60 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన్రేగా కింద ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 11 లక్షల 53 వేల కోట్లను గ్రామాల వారీగా లెక్కిస్తే – ప్రతి గ్రామానికి సగటున రూ. 8 నుంచి 10 కోట్లు ఖర్చు చేసినట్టే.ఇప్పుడు ఒక నిజాయితీగల ప్రశ్న – ఏ గ్రామానికి వెళ్లినా ఈ డబ్బుతో నిర్మితమైన శాశ్వత పనులు కనిపిస్తున్నాయా?ఈ డబ్బుతో గ్రామాల్లో ఉండాల్సింది బలమైన ప్రభుత్వ భవనాలు, పక్కా రోడ్లు, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, హరితహారం పేరుతో నిజమైన అడవుల నిర్మాణం. కానీ వాస్తవంగా జరిగినది ఏమిటంటే – గుంటలు తీయడం, మళ్లీ పూడ్చడం, కొన్ని మొక్కలు నాటడం, కొద్ది నెలల్లో వాటి ఆచూకీ కూడా లేకపోవడం. శాశ్వత ఆస్తులు లేవు. తరతరాలకు ఉపయోగపడే పనులు లేవు. డబ్బు ఖర్చయింది… కానీ అభివృద్ధి కనిపించలేదు.

ఎంజిఎన్ఆర్ఈజిఏ లోని అసలు సమస్య :

ఎంజిఎన్ఆర్ఈజిఏ గా లో అసలు సమస్య డబ్బు ఖర్చు చేయడం కాదు. డబ్బుతో ఏమి సృష్టించాం అన్నదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ పాలనలో మన్రేగా అంటే ఖర్చు + కరప్షన్ మాత్రమే. గ్రామ అభివృద్ధి మాత్రం జీరోగా మిగిలింది. ఈ 20 ఏళ్ల అనుభవం నుంచే మోదీ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది – డబ్బు ఖర్చుతో పాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించాలి. గ్రామ పంచాయతీలకు బాధ్యత ఇవ్వాలి, ప్రజలు ప్రశ్నించే హక్కు కల్పించాలన్నారు.

అందుకే వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 అవసరం.

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 యొక్క ఆత్మ ఇదే. ఉపాధి + ఉత్పాదకత కలవాలి. డబ్బు + బాధ్యత కలవాలి. గ్రామం + అభివృద్ధి కలవాలి. అప్పుడే దేశం ముందుకు నడుస్తుంది. ఈ చట్టం గ్రామాలకు నిజమైన స్వయం నిర్ణయాధికారాన్ని ఇస్తుంది. ప్రజాధనం ప్రజల పర్యవేక్షణలో ఖర్చయ్యే విధంగా వ్యవస్థను రూపొందిస్తుంది.ఈ డబ్బు సరిగ్గా ఉపయోగిస్తే – ఉదాహరణలుమన్రేగా పేరుతో ఖర్చు చేసిన రూ. 11 లక్షల 53 వేల కోట్లను ఉత్పాదక ఉపాధితో కలిపి, నిర్మాణాత్మకంగా వినియోగించి ఉంటే – దేశంలో 4 కోట్ల 60 లక్షల పక్కా ఇండ్లు నిర్మించి ఉండేవాళ్లం. 1 లక్ష 55 వేల కిలోమీటర్ల ఫోర్ లేన్ జాతీయ రహదారులు, 11 లక్షల 50 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు వేసి ఉండేవాళ్లం.

ప్రతి జిల్లాలో ఆధునిక సదుపాయాలతో 191 పడకల ఆసుపత్రులు, 2 లక్షల 30 వేల కార్పొరేట్ స్థాయి స్కూల్లు నిర్మించి ఉండేవాళ్లం. 11 కోట్ల ఎకరాలకు సాగునీటి సదుపాయం, 1 లక్ష 55 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు, 2 లక్షల 80 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమయ్యేది.

ఎంజిఎన్ఆర్ఈజిఏ – మాటలు వేరు, వాస్తవం వేరు

ఈరోజు కొందరు నేతలు మన్రేగా మీద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే – భారతదేశంలో మన్రేగా కింద 100 రోజులు ఉపాధి ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ఎక్కడా 50 రోజులు కూడా పూర్తిగా అమలుకాలేదు. ప్రత్యేకంగా తెలంగాణలో అయితే పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ ఇప్పటివరకు ఎంజిఎన్ఆర్ఈజిఏ కింద సగటున 28 రోజులకంటే ఎక్కువ ఉపాధి ఇవ్వలేకపోయారు. ఇది మాటలతో కాదు, గణాంకాలతో నిరూపితమైన వాస్తవం.

కూలీ రేట్లలో రాష్ట్రాల మధ్య తేడా – సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి

బీజేపీ పాలించే హర్యానా రాష్ట్రంలో ఎంజిఎన్ఆర్ఈజిఏ కింద రోజుకు రూ. 400 కూలీ ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం ఎందుకు కేవలం రూ. 307 మాత్రమే ఇస్తున్నారు? మీకు నిజంగా ఎంజిఎన్ఆర్ఈజిఏ మీద అంత ప్రేమ ఉంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.400 ఇస్తుంటే, తెలంగాణలో ఎందుకు తక్కువ ఇస్తున్నారు? దీనికి ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోదీ తీసుకొచ్చిన మరో కీలక మార్పు – స్థిరమైన బడ్జెట్గతంలో బడ్జెట్ ఎంత వస్తుందో, ఎంత విడుదల చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ అనిశ్చితికి ముగింపు పెట్టారు. ఈరోజు మన్రేగా కోసం నిర్ణీతమైన వార్షిక బడ్జెట్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం సుమారు రూ. 1 లక్ష 51 వేల కోట్లు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రైల్వే, విద్యా బడ్జెట్‌ల తరహాలో స్థిరత్వం తీసుకువచ్చిన చారిత్రాత్మక నిర్ణయం.

కేంద్రం–రాష్ట్రం వాటా – నిజాలు ఇవే

ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు రూ. 95 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రాల వాటా సుమారు 40 శాతం ఉంటుంది. యూపీఏ పాలనలో రూ. 10–12 వేల కోట్లు ఇవ్వడానికే చేతులు ఎత్తేసిన కేంద్రం, ఈరోజు మోదీ గారి నాయకత్వంలో రూ. 95 వేల కోట్లకు పైగా ఇవ్వడానికి ముందుకొస్తోంది. ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా కేంద్రం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది.

ఉపాధి రోజుల పెంపు – మరో చారిత్రాత్మక నిర్ణయం

మోదీ  పాలనలో మన్రేగా కింద ఉపాధి రోజుల సంఖ్యను కూడా పెంచారు. సాధారణంగా ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజుల వరకు పెంచారు. అటవీ ప్రాంతాల్లో అయితే 150 రోజుల వరకు ఉపాధి కల్పించే అవకాశం కల్పించారు. ఇది గ్రామీణ కూలీల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే నిర్ణయం.

గ్రామాల చేతుల్లోనే నిర్ణయం – ఢిల్లీ కాదు, గ్రామసభే అధికారం

ఈరోజు దేశంలో సుమారు 2 లక్షల 60 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వార్షికంగా సుమారు రూ. 1 లక్ష 15 వేల కోట్లు గ్రామాలకు వెళ్తున్నాయి. పాపులేషన్‌ను బట్టి లెక్కిస్తే, ఒక్కో గ్రామానికి సంవత్సరానికి సగటున రూ. 50 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఐదు సంవత్సరాల్లో ఇది రూ. 2 కోట్ల 50 లక్షలు అవుతుంది.ముఖ్యంగా ఈ డబ్బుపై నిర్ణయం తీసేది ఢిల్లీ కాదు – గ్రామసభ. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లే ఈ డబ్బును ఎలా వినియోగించాలో నిర్ణయిస్తారు.

వికసిత్ పంచాయత్ – మోదీ విజన్

మోదీ  స్పష్టంగా చెప్పారు – కేంద్రం నిధులు పంపిస్తుంది. వికసిత్ భారత్‌ -2047 కి అనుగుణంగా వికసిత్ పంచాయత్ ప్రణాళిక రూపొందించండి.ఐదు సంవత్సరాల ప్రణాళిక వేసుకోండి. గ్రామంలో రోడ్డు లేకపోతే రోడ్డు వేయండి. సీసీ రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు వేయండి. పంట కాలువలు లేకపోతే కాలువలు తవ్వండి. చెరువులు నిర్మించండి. ఫిష్ పాండ్స్ ఏర్పాటు చేయండి. కామన్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్, పశువుల కొట్టాలు నిర్మించండి. చేతివృత్తుల కార్మికులకు అవసరమైన భవనాలు నిర్మించండి. ఇదే వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 యొక్క అసలు ఆత్మ.

వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 ప్రత్యేకతలువీబీ–జీ రామ్ జీ చట్టం–2025 కింద విడుదలయ్యే నిధులను కేవలం నాలుగు ప్రధాన రంగాలకు మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. అవి గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీరు మరియు వ్యవసాయ రంగ బలోపేతం, పర్యావరణం మరియు క్లైమేట్‌కు సంబంధించిన పనులు, అలాగే స్థిరమైన మరియు శాశ్వత ఆస్తుల నిర్మాణం. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామానికి సగటున రూ.50 లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధుల వినియోగంపై తుది నిర్ణయం గ్రామసభకే ఉంటుంది. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు నిజమైన అధికారాలు కల్పిస్తూ, గ్రామాలకు శాశ్వత అభివృద్ధికి పునాదిగా ఈ చట్టం నిలుస్తోంది.

ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి

ఈరోజు తెలంగాణలో రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. నాట్ల సమయంలో లేబర్ లభించడం లేదు. పత్తి ఏరటానికి బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం పీక్ సీజన్‌లో కూడా రైతులకు సరైన ఉపాధి హామీ లేకుండా పోయింది.

మోదీ ప్రభుత్వం చేసిన మార్పు

ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం వ్యవసాయం పీక్ సీజన్‌లో 60 రోజుల పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే స్పష్టమైన సూచన చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు సంవత్సరానికి కేవలం 28 రోజుల ఉపాధి హామీనే అమలు చేస్తోంది. ఇది రైతులపై జరిగిన స్పష్టమైన అన్యాయం కాదా అనే ప్రశ్న ప్రజల ముందుంది.

కాంగ్రెస్ నాయకులకు బహిరంగ ఛాలెంజ్:

కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రికి నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాను. జీ–రామ్ జీ పథకంపై ఓపెన్ డిబేట్ పెట్టండి. ప్రజల ముందు చర్చకు రండి. అప్పుడు మీరు ముఖం ఎక్కడ దాచుకోవాలో ప్రజలే మీకు చెబుతారు.

గాంధీ పేరుతో రాజకీయ నాటకం:

ఈరోజు ప్రతి భారతీయుడి జేబులో ఉన్న నోటుపై గాంధీజీ చిత్రమే ఉంటుంది. గాంధీజీ గుండెల్లో ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును రాజకీయంగా ఖరాబు చేసింది. ఇందిరా గాంధీనా, రాజీవ్ గాంధీనా, రాహుల్ గాంధీనా, సోనియా గాంధీనా అనే కన్ఫ్యూషన్ ప్రజల్లో సృష్టించారు. అందుకే మోదీ గారు “గాంధీ” పేరుతో రాజకీయాలు చేయకుండా, పథకానికి పేరు మార్చి పని మీదే ఫోకస్ పెట్టారు.

బీజేపీ ‘డేంజర్’ ఎవరికీ?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు “బీజేపీ బ్రిటిష్ వాళ్లకంటే డేంజర్” అని అన్నారు. నిజమే, బీజేపీ డేంజర్ ఎవరికంటే – కుటుంబ పార్టీలకు డేంజర్, అవినీతి పార్టీలకు డేంజర్, మత రాజకీయాలు చేసే వారికి డేంజర్, భారతమాతను విమర్శించే వారికి డేంజర్, హిందూ దేవుళ్లను అవమానించే వారికి డేంజర్.

చివరగా… ముఖ్యమంత్రి గారికి చిన్న వయసులోనే పెద్ద బాధ్యత వచ్చింది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి ఢిల్లీకి వెళ్లి “తాను ఆర్‌ఎస్‌ఎస్” అంటారు, మళ్లీ ఎర్రజెండా సభల్లో “తాను పెద్ద కమ్యూనిస్టును” అంటారు. ప్రజలు గమనిస్తున్నారు, గ్రామాలు గమనిస్తున్నాయి, రైతులు గమనిస్తున్నారు. జీ–రామ్ జీ పథకం గ్రామాలకు పండుగ. దాన్ని విమర్శించడం గ్రామాలపై దాడి చేయడమే. ఈ విషయాన్ని సర్పంచులకు, రైతులకు, గ్రామ వర్కర్స్‌కు చేరవేయాలని విన్నవిస్తున్నాను.ఈ మీడియా సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ గారితో పాటు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య , సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top