EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్ విమోచన చరిత్రను ప్రతి ఇంటికీ చేరుస్తాం

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 26; బుధవారం

తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు, అణచివేతకు గురైందని, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల రక్తచరిత్ర నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17నే విమోచనం లభించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ డా. బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలన కింద ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో సెప్టెంబర్ 17ను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే, పోరాటానికి కేంద్రబిందువైన తెలంగాణలో మాత్రం అమరవీరులకు అధికారిక గుర్తింపు ఇవ్వకపోవడం చారిత్రక అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 తొలిదశ ఉద్యమంలో 369 మంది, మలిదశలో దాదాపు 1,200 మంది బలిదానాలు చేశారని, రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు గడుస్తున్నా అమరవీరుల స్థూపానికి తాళాలు వేసి ఉండటం, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

సుందర్‌లాల్ కమిటీ నివేదిక ప్రకారం విమోచన పోరాటంలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, నిజాం పాలన ముగిసినా గడీల రాజకీయ సంస్కృతి కొనసాగుతోందని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. తెలంగాణ విమోచన పోరాటం ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదని, నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా కలం పట్టిన ముస్లిం జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు పొట్టనబెట్టుకున్న ఉదంతమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు, అప్పీజ్మెంట్ రాజకీయాల కోసం ఎంఐఎంకు తలొగ్గి చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహిస్తోందని, అదే స్ఫూర్తితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు విమోచన చరిత్రను ప్రతి గడపకూ చేర్చేందుకు ‘తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ’ ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణను రూపొందించినట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా తెలంగాణ విమోచన సాధన కోసం బీజేపీ తరఫున 7 ప్రధాన డిమాండ్లను ఆయన రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు:

సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.

విమోచన ప్రదాత సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారీ స్మారక చిహ్నం ‘స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ – తెలంగాణ’ను హైదరాబాద్‌లో నెలకొల్పాలి.*

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘తెలంగాణ విమోచన మ్యూజియం’ ఏర్పాటు చేయాలి.

ప్రతి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం’ నిర్మించాలి.

తెలంగాణ విమోచన చరిత్రను అధికారిక పాఠ్యపుస్తకాలలో చేర్చాలి.

అమరవీరులు, ఉద్యమకారుల సమగ్ర జాబితాను రూపొందించి వారికి, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి.

వీరభైరాన్‌పల్లి, పరకాల (డెక్కన్ జలియన్‌వాలాబాగ్), కడవెండి, జోడేఘాట్, నిర్మల్, నల్గొండ వంటి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ ‘తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్’ను అభివృద్ధి చేయాలి.అదేవిధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బీజేపీ 5 కీలక ప్రతిజ్ఞలను ప్రకటించిందని తెలిపారు.

రజాకార్ రాజకీయ వారసత్వ కలయిక అయిన ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూటమికి చరమగీతం పాడటం.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రమంతటా పన్నులు, చట్టాల అమలులో సమానత్వం ఉండేలా “ఒకే రాష్ట్రం – ఒకే రూల్” విధానాన్ని తీసుకురావడం.

అదేవిధంగా ఈ ఆగస్టు 27న వీరభైరాన్‌పల్లిలో, సెప్టెంబర్ 2న పరకాల అమరధామంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని, పార్టీలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చరిత్ర పునరుజ్జీవన యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, విమోచన కమిటీ సభ్యులు శ్రీ కప్పర ప్రసాద్ రావు, సందీప్ సాయి, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top