ఈతరం భారతం ఖమ్మం: జూన్ 16
జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకుని కోర్టు కేసుల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ జి. రాజగోపాల్ సూచించారు.
మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి పి. దేవి మానస ఆధ్వర్యంలో బ్యాంకర్లు, చిట్‌ఫండ్ మరియు ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు కేసులు త్వరగా ముగుస్తాయని తెలిపారు. “రాజీయే రాజమార్గం” అని పేర్కొంటూ, లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై పై కోర్టులకు అప్పీలు చేసుకునే అవసరం ఉండదని వివరించారు.ప్రస్తుతం ఖమ్మం కోర్టులో 2,733 ఎన్‌ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులు, 1,118 ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కేసులను పరస్పర అంగీకారంతో రాజీ ద్వారా పరిష్కరించేందుకు సంబంధిత సంస్థల ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. రమేష్, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం. శ్రీనివాస్, వివిధ బ్యాంకులు, చిట్‌ఫండ్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.















