ఈతరం భారతం ఖమ్మం, 23 జూన్ :రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్
ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్రస్థాయిలో తిరుగుతూ నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా పునాదుల నిర్మాణం, గోడల నిర్మాణం, పైకప్పు పనులు, తుదిదశ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీసి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఇండ్ల నిర్మాణాలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వేగంగా కొనసాగు ఉన్నాయని తెలిపారు. వెలుగుమట్ల కాలనీకి ప్రధాన రహదారి, వాటర్ సౌకర్యం, విద్యుత్ స్తంభాలు పూర్తిస్థాయిలో లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆదేవిధంగా ఇండ్లకు విద్యుత్ కనెక్షన్ తో పాటు మీటర్లు అమరుస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు స్థిరమైన గృహ వసతి కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. ఇంటి నిర్మాణం వివిధ దశలను పూర్తిచేసిన వెంటనే ప్రభుత్వ ఆర్థిక సహాయం విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందన్నారు. పునాదుల నిర్మాణం పూర్తయిన తర్వాత, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత, స్లాబ్ దశ పూర్తయిన తర్వాత, తుదిదశ పనులు పూర్తయిన తర్వాత మొత్తం రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునాది దశ పనులు ప్రారంభించలేని కుటుంబాలకు మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులు నిర్మాణ పనులు నిలిచిపోకుండా కొనసాగించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల విషయంలో రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహాయం, పరిపాలనా అనుమతులు సకాలంలో అందించడంతో పాటు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీ లో కలెక్టర్ వెంట హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యుత్ ఎస్ఇ శ్రీనివాసచారి, ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















