EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సిఎం చేతుల మీదుగా 362 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు …

ఈతరం భారతం ఖమ్మం, జనవరి- 16:

పాలేరు నియోజకవర్గంలో 362 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం మద్దులపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి జనవరి 18న జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటనపై మీడియా సమావేశంలో వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గం పరిధిలోని మద్దులపల్లిలో జెఎన్టియు కళాశాల భవన నిర్మాణానికి, మున్నేరు నుండి పాలేరు లింక్ కెనాల్ కు శంకుస్థాపనలు, నూతన మార్కెట్ యార్డు, కూసుమంచి లో 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరణ,ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతుందని అన్నారు.సీఎం పర్యటనలో డిప్యూటీ సీఎం, ఇంచార్జీ మంత్రి శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహాతో పాటు తాను పాల్గొంటారని తెలిపారు. 362 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనులకు పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక కార్పోరేషన్, 6 మున్సిపాలిటీలకు సంబంధించిన రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ముఖ్య కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహిస్తారని, డివిజన్లు మున్సిపల్ వార్డులకు సంబంధించి ముఖ్యమైన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతూ వారి కష్టాలు తొలగించే విధంగా ప్రత్యక్షంగా ప్రజల పక్షాన నిలబడి వారికి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా పరిస్థితులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల కోసం తాము పని చేయమని, ఇందిరమ్మ ఇండ్లను ఎన్నికల కోసం ప్రారంభించలేదని, అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందిస్తామని అన్నారు. బొమ్మలు చూపే ప్రభుత్వం కాదని, ప్రజాప్రభుత్వం అని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే ప్రభుత్వం అని, కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు.మేడారంలో జనవరి 28 నుంచి జనవరి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని, ప్రతి రెండు సంవత్సరాలకు జాతర జరగడం సర్వ సాధారణం అని, ఈ సారి జరిగే జాతరకు ప్రత్యేకత ఉందని,  ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అక్కడ కాకతీయుల రాతి కట్టడాల తరహాలో సుందరీకరణ, శాశ్వత రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించామని అన్నారు. పూజారుల సూచనల ప్రకారం జనవరి 19న మేడారం అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని, జనవరి 18న సాయంత్రం మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందని అన్నారు. కుంభమేళా తరహాలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top