ఈతరం భారతం మహబూబ్ నగర్ జూన్ 5 :
పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని,సాగు తాగునీరుకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన చేసి, పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ తయారీకి చర్యలు చేపట్టినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో పాలమూరు నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆశించామన్న ఆయన, కృష్ణా జలాలు పూర్తిగా జిల్లాలో ప్రవహించినా ఎన్నడూ ఒడిసిపట్టుకోలేదని ఆక్షేపించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. పాలమరేవరెడ్్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సీఎం రేవరెడ్డిసా నార్లాపూర్ హెడ్ రెగ్యులేటర్ పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే 26 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేదని రేవంత్ రెడ్డి వివరించారు. ఆ ప్రాజెక్టు కోసం రూ.27 వేల కోట్ల ఖర్చు పెట్టి పంపులు, లిఫ్టు పనులు చేపడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసిందన్నారు. కమీషన్ల పేరిట రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్నారు. జూరాల ప్రాజెక్టు మినహా జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కూడా జరగలేదని తెలిపారు. పంపులు, లిఫ్టు పనుల్లో అవినీతిపై నాగం జనార్దన్ రెడ్డి ఏళ్ల తరబడి పోరాడారని తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు
పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిధుల కోసం పక్కా కార్యాచరణతో క్షేత్రస్థాయి పర్యటన చేస్తామన్నారు. భూ సేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. తక్కువ భూసేకరణ ఉండి ఎక్కువ నీళ్లు నిల్వచేసుకునే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము పనులు చేపడుతుంటే వాళ్లు(బీఆర్ఎస్) రాజకీయ కార్యాచరణ చేపడుతున్నారని వివరించారు. పాపాలు చేయడమే కాకుండా కేసీఆర్ చేస్తుంటే చూడటం కూడా మహాపాపమని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అప్పులకు రూ.84 వేల కోట్లు చెల్లించారన్నారు. గత పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసిన అప్పులకు రూ.52 వేల కోట్ల చెల్లించామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాక రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వాటిలో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టుకు ఇచ్చామని అన్నారు.
కేసీఆర్ రద్దయిన రూ.1000 నోటు వంటివారు
బీఆర్ఎస్ ఏ ప్రాజెక్టయినా మొదలు పెట్టి పూర్తి చేసిందా చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి ఊరు మార్చి దోపిడీ చేయడమే కేసీఆర్కు తెలుసన్నారు. కేసీఆర్ సొంతంగా మొదలు పెట్టి చేపట్టిన ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. ఆ ప్రాజెక్టుల విషయమై అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత చుక్క నీళ్లు తీసుకోకుండా ఎక్కువ వరి ఉత్పత్తి చేశామన్నారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఒక్క పైసా విలువ లేదని, బీఆర్ఎస్ అనేది గతమన్నారు. కేసీఆర్ రద్దయిన రూ.1000 నోటు వంటి వారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి, నాయకులకు గతమే ఉందని, భవిష్యత్ లేదని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ చేయాలని రేవంత్ రెడ్డి వివరించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ లేకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా అని ప్రశ్నించారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నామని వివరించారు. గతంలో భారీగా అప్పులు చేయడం వల్ల ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు రూ.55 వేల కోట్ల అంచనా వేసి రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. 50 శాతం నిధులతో ఖర్చు లేకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని చెప్పారు. ఉన్నదంతా దోచుకుని తమను దోషులుగా నిలబెడతామనే భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు.














