EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పుచ్చలపల్లి సుందరయ్య సేవలు మరచిపోలేనివి

ఈతరం భారతం క‌న‌గ‌ల్‌, మే 19 :

దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం న‌ల్ల‌గొండ‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను మంగళవారం వేములనాగయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భావ‌తి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన, వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సుందరయ్య సమర్థ నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన సుందరయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని, ఆయన అనుసరించిన నిబద్ధత, త్యాగం, నిజాయితీ, ప్రజాసేవా మార్గాన్ని ప్రతి ప్రజాప్రతినిధి అనుసరించాలని కోరారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా మతాన్ని చొప్పించే ప్రమాదకర విధానాలు అమలు చేస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు. సుందరయ్య పోరాట పంథానే కమ్యూనిస్టు ఉద్యమాలకు దిక్సూచి అని పేర్కొంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో గ్రామాల స్థాయిలో విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు మద్దెల వినోద, మండల కమిటీ సభ్యురాలు ఎండి సుల్తానా, నాయకులు వేముల సాయమ్మ, కొండ వెంకటేశం, షేక్ రఫీ, మాచర్ల రాములమ్మ, గోగు సత్తయ్య, తాటికొండ బక్కయ్య పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top