EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం అవసరం- జీవితంలో అనుకున్నది సాధించాలి: చిన్న వయసులో పెళ్లిళ్లు వద్దు

ఈతరం భారతం నారాయణపేట ఏప్రిల్ 28

ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్రం అవసరమని, చిన్న వయస్సులో పెళ్లి చేసుకోకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో అనుకున్నది సాధించాలని జిల్లా కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ,బాలల భద్రత వారం (27 నుంచి 02/05 వరకు) కార్యక్రమాలలో భాగంగా మంగళవారం మహిళాభివృద్ధి/శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కౌమార బాలికల గర్భధారణ సమస్యలపై, ఇంటి నుంచి పారిపోవడం అనే అంశంపై జిల్లా బాలల సంరక్షణ విభాగం మద్దూరు రైతు వేదికలో కిశోర బాలికలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొందర పాటు నిర్ణయం తీసుకోరాదని చెప్పారు. తాను హాస్టల్ లో చదువుకునే రోజుల్లో తన రూమ్ మెట్ ఒక అమ్మాయి వాళ్ల అమ్మకు ఆరోగ్యం బాగా లేదని చదువు ఆపేసి పెళ్లి చేసుకుందని, ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలతో సాధారణ గృహిణిగా జీవనం సాగిస్తోందని, అదే చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా ఉంటే చదువుకుని ఉంటే ఇప్పుడు ఆమె ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండేదని కలెక్టర్ చెప్పారు. అలాగే 2012 లో తాను డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక కౌమార దశ బాలిక ప్రేమ పేరిట ఆకర్షణకు గురైతే స్వయంగా తానే పోలీసులు, అంగన్ వాడీ సీ డి పీవో లకు సమాచారం ఇచ్చి బాల్య వివాహాన్ని అడ్డుకున్నానని అప్పటి జ్ఞాపకాలను కలెక్టర్ విద్యార్థినులతో పంచుకున్నారు. కౌమార దశలో ప్రేమా, ఇష్టం, అభిమానం అనేవి కేవలం ఆకర్షణ అని, విద్యార్థినిలు వాటికి దూరంగా ఉండాలని కలెక్టర్ హితవు చెప్పారు. బాలికలు మంచిగా చదువుకుని జీవితంలో సెట్ కావాలని అప్పుడే ఆ తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నారు.

కౌమార వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్యపరమైన, సామాజికపరంగా వచ్చే సమస్యలు వాటి వల్ల ఎదుర్కొనే ప్రమాదాలపై అదేవిధంగా ఇంటి నుంచి పారిపోవడం వలన లైంగిక దోపిడి,శ్రమ దోపిడి , అక్రమ రవాణా జరగడం, చట్ట పరంగా వచ్చే సమస్యల గురించి వివరించారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ,బాలలపై జరిగే లైంగిక దోపిడీ నుంచి రక్షణ చట్టాల గురించి, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం గురించి బాలికలకు అవగాహన కల్పించారు.

ప్రతి బాలిక వాళ్లు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా చదువుకోవాలని జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించడం వల్లనే ఏదైనా సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ చదువు కొనసాగించడంపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

.

Related News

Select the Topic
Scroll to Top