EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం

ఈతరం భారతం హైద్రాబాద్ (పరిగి) మే 25 :

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర నేడు పరిగిలో కొనసాగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరిగి వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని (కులకచర్ల కేంద్రం) స్వయంగా సందర్శించింది. అక్కడ ఉన్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను, ఆవేదనను అడిగి తెలుసుకుంది.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడైతే కొనుగోళ్లు సజావుగా జరగడం లేదో ఆయా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాం. రెండు నెలల క్రితమే మా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని, వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, మౌలిక వసతులు కల్పించి, కొనుగోళ్లు సకాలంలో జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

రాష్ట్రంలోని దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. రైతులు గత 10-15 రోజులుగా లారీలు ఎప్పుడు వస్తాయో, తమ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచిచూస్తున్నారు. కేంద్రాల్లో టార్పాలిన్లు, గోనెసంచులు లేక, లారీలు రాక, తూకాలు సకాలంలో కాక రైతాంగం తీవ్ర అల్లాడిపోతోంది. మొదట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను తెలుసుకుని రైతులకు భరోసా కల్పించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇవాళ ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర సీనియర్ నాయకుల బృందమంతా సందర్శించాం.

అయితే బీజేపీ బృందం పర్యటిస్తుందనే సమాచారంతో నిన్న రాత్రికి రాత్రే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి రైతులను బెదిరించి, సంచులను నింపి, ఎట్లా పడితే అట్లా మిల్లర్ల వద్దకు తరలించింది. ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకుండానే, అధికారులు ధాన్యం కొనుగోలు చేసేశామంటూ అబద్ధాలు చెప్పడం దారుణం. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ట్రాక్టర్లలో గోనె సంచులు తీసుకొచ్చి రైతుల ధాన్యాన్ని నింపి మిల్లర్లకు తరలించామని రైతులే స్వయంగా మాకు చెబుతున్నారు. కేవలం బీజేపీ నాయకుల బృందం వస్తోందనే భయంతోనే.. ప్రభుత్వ యంత్రాంగం కళ్లుగప్పేలా కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నట్లుగా ఇక్కడ డ్రామాలు ఆడుతోంది.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ధాన్యానికి మౌలిక వసతులు కల్పించి, వేగంగా కొనుగోళ్లు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top