ఈతరం భారతం వనపర్తి, ఆగస్ట్ 21 ; శుక్రవారం :
వనపర్తి ప్రభుత్వ బీసీ కాలేజ్ బాలుర హాస్టల్‌లో విద్యార్థుల భోజనం కోసం కేటాయించిన బియ్యం విషయంలో తీవ్రమైన అనుమానాలు, వ్యత్యాసాలు వెలుగులోకి వచ్చాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, పిడిఎస్ యు బిసి పొలిటికల్ జే ఏసీ బంజారా గిరిజన విద్యార్థి సమైక్య నాయకులు తెలిపారు.
హాస్టల్‌కు 46 క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉండగా 25 క్వింటాళ్ల బియ్యం మాత్రమే తీసుకువచ్చినట్లు తమకు లభించిన సమాచారం, ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కి ఫిర్యాదు చేయడంతో, వారి ఆదేశాల మేరకు వనపర్తి తహసీల్దార్ హాస్టల్‌కు చేరుకుని సంబంధిత రికార్డులు, బియ్యం నిల్వలను పరిశీలిస్తూ పంచనామా నిర్వహించినట్లు తెలిపారు.
పంచనామాలో నమోదు చేసిన వివరాల ప్రకారం, 13-08-2026న 15 క్వింటాళ్ల బియ్యాన్ని “హ్యాండ్ లోన్”గా తీసుకున్నట్లు హాస్టల్ వార్డెన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు. అయితే సంబంధిత గోదాం అధికారులను సంప్రదించినప్పుడు, హాస్టల్‌కు 15 క్వింటాళ్ల బియ్యాన్ని హ్యాండ్ లోన్‌గా ఇచ్చినట్లు తమ వద్ద ఎలాంటి రికార్డు లేదని గోదాం సిబ్బంది తెలిపినట్లు వారు పేర్కొన్నారు.
అసలు 15 క్వింటాళ్ల బియ్యం ఎక్కడికి వెళ్లింది?
గోదాం రికార్డుల్లో జారీ వివరాలు లేకపోతే, 15 క్వింటాళ్ల బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తరలించబడింది? ఎవరు స్వీకరించారు? ఎక్కడ వినియోగించారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని పిడిఎస్ యు బిసి పొలిటికల్ జే ఏసీ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు కే పవన్ కుమార్ దేవర శివ గౌడ్ టౌన్ ప్రెసిడెంట్, మహేందర్ నాయుడు, ధర్మేందర్, రాజు, బాలవర్ధన్,
బంజారా గిరిజన విద్యార్థి శివ నాయక్ నేడొక ప్రకటనలో డిమాండ్ చేశారు.
అలాగే పంచనామాలో నమోదు చేసిన బియ్యం నిల్వలు, స్టాక్ రిజిస్టర్, గోదాం జారీ వివరాలు, రవాణా వాహన వివరాలు, హ్యాండ్ లోన్‌కు సంబంధించిన రికార్డులు అన్నింటినీ పరస్పరం సరిపోల్చి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..
విద్యార్థుల భోజన బియ్యంపై అక్రమాలకు తావు లేదు
ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తున్న బియ్యం పేద విద్యార్థుల హక్కు అని, ఆ బియ్యంలో ఒక్క కిలో కూడా పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన పర్యవేక్షణ చేయాలని నాయకులు అన్నారు.
46 క్వింటాళ్లకు బదులు 25 క్వింటాళ్లు మాత్రమే ఎందుకు వచ్చాయి?
15 క్వింటాళ్ల హ్యాండ్ లోన్‌కు గోదాం రికార్డు ఎక్కడ ఉంది?
బియ్యం నిల్వలు, స్టాక్ రిజిస్టర్ ఎందుకు సరిపోవడం లేదు?
బియ్యం రవాణా వివరాలు ఏమిటి?
బాధ్యత ఎవరిది?
అనే ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
21-08-2026న నిర్వహించిన పంచనామాను ఆధారంగా తీసుకుని సమగ్ర విచారణ జరపాలి.
హాస్టల్ మరియు గోదాం స్టాక్ రిజిస్టర్లను క్రాస్ వెరిఫై చేయాలి. 15 క్వింటాళ్ల హ్యాండ్ లోన్ వ్యవహారంపై గోదాం రికార్డులను పరిశీలించాలి.
బియ్యం రవాణాకు సంబంధించిన వాహనం, డ్రైవర్, రవాణా మరియు డెలివరీ వివరాలను పరిశీలించాలి.
గత కాలానికి సంబంధించిన బియ్యం స్టాక్, ఇండెంట్, మెస్ వినియోగం, డైట్ బిల్లులను కూడా ఆడిట్ చేయాలి.
విచారణలో అక్రమాలు రుజువైతే సంబంధిత బాధ్యులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తేలితే బాధ్యుల నుంచి నష్టపరిహారం/రికవరీ చేయాలి.విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరిపడా బియ్యం నిరంతరం అందేలా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి.
“విద్యార్థుల కడుపు నింపాల్సిన బియ్యం పక్కదారి పట్టడానికి వీల్లేదు. పంచనామాలో వెలుగులోకి వచ్చిన అంశాలపై నిష్పక్షపాత విచారణ జరిపి, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి” అని డిమాండ్ చేశారు.













