ఈతరం భారతం యాదాద్రిభువనగిరి(బీబీనగర్)జులై 9 :
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, మౌలిక వసతుల రంగంలో ఒక సుదీర్ఘమైన ముందడుగు పడిందన్నారు.
20వ శతాబ్దం చివరి వరకు దేశంలో న్యూఢిల్లీలో కేవలం ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేది. ఆ తర్వాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారి హయాంలో మరో 6 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది.2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను బలోపేతం చేస్తూ మొత్తం ఎయిమ్స్ ల సంఖ్యను 23కు పెంచడం జరిగిందని చెప్పారు.
వీటిలో ప్రస్తుతం 18 ఎయిమ్స్ సంస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.ప్రాథమిక వైద్యం నుండి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు అనుసంధానం చేస్తూ దేశంలో బలిష్టమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించాము. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,85,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దాదాపు 15 లక్షల మంది ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
అలాగే గతంలో కేవలం 370 గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యను ఇప్పుడు 820 మెడికల్ కాలేజీలకు పెంచడం జరిగింది.వేగంగా విస్తరిస్తున్న బీబీనగర్ ఎయిమ్స్ సేవలు: జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్, కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఎంతో వృద్ధి సాధించి సేవలందిస్తోంది. దీని కోసం రూ. 1,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ. 110 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 132 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 133 మంది సీనియర్ వైద్యులుసేవలందిస్తున్నారన్నారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, 24 విభాగాలలో ఎండీ (MD), 5 విభాగాలలో డీఎం (DM)/ఎంసీహెచ్ (MCh) వంటి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ (OPD) విభాగంలో అన్ని ప్రధాన స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు.
ఇన్‌పేషెంట్ కేర్, ఎమర్జెన్సీ సేవలతో పాటు సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డెక్సా వంటి అత్యాధునిక పరీక్షల సౌకర్యం ఉంది. ‘ఈ-సంజీవని’ డిజిటల్ టెలిమెడిసిన్ ద్వారా ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు విజయవంతంగా వైద్య సలహాలు అందించారు.
ఇక్కడ పీఎం-జై (PM-JAY) తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నాము.ఎయిమ్స్ అనేది కేవలం రోగులకు చికిత్స అందించే కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ. బీబీనగర్ ఎయిమ్స్‌లో పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ. 64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం 129 రీసెర్చ్ ప్రాజెక్టులపై పనులు జరుగుతుండగా, ఇక్కడి ఫ్యాకల్టీ ఇప్పటివరకు 156 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఎయిమ్స్ సంస్థలో ‘కమ్యూనిటీ రేడియో స్టేషన్’ ప్రారంభించిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్‌కే దక్కింది. ఈ సంస్థ ద్వారా 6 గ్రామాలను దత్తత తీసుకొని, ఇప్పటివరకు 547 ఉచిత వైద్య శిబిరాలను (Medical Camps) నిర్వహించి, దాదాపు 66,148 మంది గ్రామీణ రోగులకు వైద్య సంరక్షణ అందించడం విశేష మన్నారు.
డిసెంబర్ 2026 నాటికి పూర్తి స్థాయి నిర్మాణం: ఎయిమ్స్ నిర్మాణ పనులపై ఈరోజు సమగ్ర సమీక్ష నిర్వహించాము. ప్రస్తుతం 87% పనులు పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి ఈ సంస్థను 100% పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నాము. ఈ పనులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వారానికోసారి, అడిషనల్ సెక్రటరీ గారు ప్రతి రెండు నెలలకోసారి పర్యవేక్షిస్తున్నారు.ఇది 2008 నాటి పాత భవనం (గతంలో నిమ్స్ కోసం ఉద్దేశించింది) కావడంతో, దీనిని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం, రీస్ట్రక్చరింగ్, రెట్రోఫిట్టింగ్ (రెనోవేషన్) చేయడం ఎంతో సంక్లిష్టమైన పని అని,అయినప్పటికీ అధునాతన వసతులతో రేడియోగ్రఫీ, ఓటీ (OT) కాంప్లెక్స్‌లను త్వరలోనే సిద్ధం చేస్తున్నాము. ఇది వైద్య విద్య, రోగుల సంరక్షణ, పరిశోధన రంగాలలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ‘ గా నిలవబోతోంది.ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ పూర్తి స్థాయిలో పుంజుకోవడానికే 20 ఏళ్లు పట్టింది. కానీ బీబీనగర్ ఎయిమ్స్ గత నాలుగేళ్లలోనే అద్భుతమైన ప్రగతి పథంలో సాగుతోంది. ఏదైనా ఒక పెద్ద జాతీయ విద్యా వైద్య సంస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి కనీసం 10 సంవత్సరాల సమయం పడుతుందన్నారు.ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా, రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి (పయనీర్) వైద్య సంస్థగా మారుతుంది అని చెప్పారు.















