EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు అధిక ఆదాయం సంపాదించాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

ఈతరం భారతం ఖమ్మం, సెప్టెంబర్ 08:    లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు అధిక ఆదాయం సంపాదించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

మంత్రివర్యులు సోమవారం ఖమ్మం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి శంకుస్థాపన చేశారు.రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామంలో 3 కోట్ల రూపాయల చేపట్టిన వెనకబడిన తరగతుల బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు, 30 లక్షలతో నిర్మించనున్న పశు వైద్యశాల భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, ఖమ్మం నగర పాలక సంస్థ 9వ డివిజన్ పరిధిలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నిధులు 66 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వి. వెంకటాయపాలెం పిఏసీఎస్ వద్ద ఏర్పాటుచేసిన సిఎస్ సి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నీటిపారుదల శాఖతో రివ్యూ నిర్వహించి నష్టపోయిన గ్రామ ప్రజలకు ఇంటి స్థలాల పంపిణీకి అవకాశం పరిశీలించాలని అన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఖమ్మం లో పదిహేను ఎత్తిపోతల పథకాలు చేపట్టామని అన్నారు.రైతులు వరి కాకుండా ఆయిల్ పామ్, వక్క, జాజి, జాజి పత్రి వంటి లాభదాయక పంటలు సాగు చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడాలని మంత్రి సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ క్రింద ఉన్న ప్రాంతాలు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధిక ఆదాయం సంపాదించాలని అన్నారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పూర్తి చేయాలని, ఎక్కడా నాణ్యత లోపం రావడానికి వీలు లేదని అన్నారు. 3 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ కార్పోరేట్ సంస్థలకు ధీటుగా వసతి గృహాన్ని నిర్మించి పిల్లలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ఇబ్బందులు సానుకూల దృక్పథంతో పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యా సంస్థలు ఉన్న జిల్లాలో మన ఖమ్మం 2వ స్థానంలో ఉందని అన్నారు. బీసీ హాస్టల్ నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాలని, ప్రాథమిక దశ నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 170 మంది విద్యార్థులు చదువుతున్నారని, రాబోయే విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 300కు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డిఆర్డీవో సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. పురందర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, రఘునాథపాలెం ఎంపిడివో అశోక్ కుమార్, తహసీల్దార్ శ్వేత, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top