ఈతరం భారతం ఖమ్మం : సెప్టెంబర్ 18 :
——————————————
ఖమ్మం జిల్లాను హెచ్ఐవి, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలోని ఎస్ఆర్&బిజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.ఎస్ఆర్&బిజిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లింక్ వర్కర్లు తదితరులు హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు అవగాహన, జాగ్రత్తలు, బాధ్యతాయుతమైన ఆరోగ్య అలవాట్లు ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యంగా యువతలో ఎయిడ్స్ పై శాస్త్రీయమైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎయిడ్స్ తో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా, వారికి సామాజిక మద్దతు అందించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా హెచ్ఐవి నివారణ, నియంత్రణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని, ముఖ్యంగా యువత, విద్యార్థులు, అధిక ప్రమాదానికి లోనయ్యే వర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి నిర్ధారణ, చికిత్స, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జానపద కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాతా సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కథన విధానం ‘పల్లె సుద్దులు’ ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, చికిత్స మరియు వివక్ష నిర్మూలనపై యువత, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో* డియంహెచ్ఓ డా. రామారావు, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వేణు మాధవ్, అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ & లెప్రసి) డాక్టర్ ఎల్. ప్రవీణ, ఎస్ఆర్&బిజిఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాకీరుల్లా, ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ బి. చెంచు రత్నయ్య, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సునంద, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది, కె.సి. పుల్లయ్య స్వచ్ఛంద సేవా సిబ్బంది, జనవాణి స్వచ్ఛంద సేవా సిబ్బంది, లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సేవా సిబ్బంది, ఎ. శంకర్, అప్పా ప్రెసిడెంట్, డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నా.రు.















