ఈతరం భారతం యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర పట్టణమైన యాదగిరిగుట్టలో ఉన్న వేశ్య గృహాలను పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరానికి తరలించాలని, పవిత్రతను కాపాడాలని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని ఎసిపికి అందజేశారు. విజ్ఞాపన ప్రతులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తో సహా జిల్లా కలెక్టర్ కు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు రాచకొండ పోలీసులకు, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి… అదే విధంగా భువనగిరి డిసిపికి పంపుతున్నట్లు ఆ విజ్ఞాపన పత్రంలో వారు పేర్కొన్నారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు పట్టణంలోని వేశ్యా గృహాల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. పట్టణంలో వేశ్య గృహాల పక్కనే వైన్ షాపులు కూడా ఉండటంతో ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వేశ్య గృహాల నిర్వాహకుల ఆగడాలు మితిమీరి పోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు విజ్ఞప్తి చేసిన వారిలో డికొండ జోగయ్య, ఎరుకల హేమేందర్, గుండ్లపల్లి భరత్ గౌడ్ , ఆరె శ్రీధర్ గౌడ్ ,బందారపు భిక్షపతి గౌడ్ , ముఖ్యర్ల మల్లేశం, బబ్బూరి శ్రీధర్, పేరబోయిన మహేందర్ తో సహా వందమందికి పైగా ఉన్నారు.















