ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 18 :: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడవును సెప్టెంబర్ 26 వరకు పొడిగించడం జరిగిందని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు చెప్పారు. హైదరాబాద్ లోని బేగంపేట ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలలో ఉన్న యూనివర్సిటీ ప్రాంతీయ మహిళా అధ్యయన కేంద్రంలో గురువారం అడ్మిషన్ల పోస్టర్ ను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ బి శ్రీనివాస్, బేగంపేట కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి తో కలిసి ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంటర్, ఓపెన్ ఇంటర్ , ఐటిఐ ,డిప్లమా ఉత్తీర్ణులైన వారు డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చని, డిగ్రీ బిఏ, బీకాం, బీఎస్సీ పాస్ అయిన వారు పీజీలో, ఎంఏ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేట్, తెలుగు లిటరేట్ హిందీ లిటరేట్ అడ్మిషన్ పొందవచ్చునని చెప్పారు. డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల విద్యార్థులు సెప్టెంబర్ 26 వరకు అడ్మిషన్ల ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె పద్మావతి మాట్లాడుతూ ఈ కళాశాలలో మహిళలకు ప్రత్యేక వసతులు ఉన్నాయని, త్వరలోనే అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు.
బేగంపేట ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామాచారి మాట్లాడుతూ అడ్మిషన్ల గడువు పొడిగించినందున ఆసక్తి కలిగిన వారు డిగ్రీ,పీజీ లలో ప్రవేశాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో బేగంపేట అధ్యయన కేంద్రం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.















