EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం.. దర్యాప్తులో సంచలన విషయాలు

ఈతరం భారతం/హైదరాబాద్/  అక్టోబర్ 25 :

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మాటలకందని ఈ విషాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు.రూ.46 లక్షలు విలువైన దాదాపు 234 మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉన్నట్లు గుర్తించారు. బస్సు ఢీ కొట్టగానే బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ మూత ఊడి అందులోని పెట్రోల్‌ మొత్తం రోడ్డుపై పడింది. బైక్‌ను బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఆ అధిక వేడికి బస్సు లగేజ్‌ క్యాబిన్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద శబ్దం వచ్చింది.సాధారణంగా మొబైల్‌ ఫోన్ల పైభాగం ప్లాస్టిక్‌తో తయారు చేసినప్పటికీ.. బ్యాటరీలు మాత్రం లిథియంతో తయారు చేస్తారు. అవి అధిక వేడికి పేలుతాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో అధిక వేడికి అవి పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ బృందాలు భావిస్తున్నాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ నుంచి పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని.. దీంతో వారు తప్పించుకునే ఛాన్స్‌ లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్‌ ఫోన్లే కారణమని ప్రాథమికంగా తేలింది.

బైకర్‌ శివశంకర్‌ వీడియో వైరల్‌.. మద్యం మత్తులో ఉన్నాడా?

కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు యాక్సిడెంట్‌లో మరణించిన బైకర్‌ శివశంకర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ప్రమాదానికి ముందు శివశంకర్‌ పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు. అతనితోపాటు బైక్‌పై మరో యువకుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్‌ మద్యం మత్తులో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.శుక్రవారం తెల్లవారుజామున 2.22 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్‌ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు ఆ వీడియోలో ఉంది. శివశంకర్‌ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్‌ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్‌ స్టార్ట్‌ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్‌ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే

.

 

Related News

Select the Topic
Scroll to Top