EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏకంగా ఐదు లక్షల ఇళ్లు…

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 15 మంగళవారం

__________________________________________

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఏకంగా ఐదు లక్షల ఇళ్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల మంజూరు జరగడం ఇదే మొదటిసారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ మంజూరు జరిగింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 1.78 లక్షల ఇళ్లలో, ఇప్పటివరకు కేవలం 42 వేల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటిని పూర్తి చేయడంతో పాటు, తాజాగా ఏపీకి అదనంగా మరో 1.22 లక్షల ఇళ్లను కేటాయించారు. ఇక తెలంగాణ విషయానికొస్తే, గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిరాకరించడంతో గతంలో ఇళ్ల మంజూరు జరగలేదు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తి మేరకు, తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పీఎంఏవై కింద ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం రూ. 1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తుంది. ఇతర పథకాల సాయాన్ని కూడా కలిపితే, మొత్తం రూ. 1.70 లక్షల నుంచి రూ. 1.80 లక్షల వరకు లబ్ధిదారులకు అందుతుంది. దీనికి అదనంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12,000 సహాయం అందించనున్నారు.ఈ పథకాన్ని మరింత మంది పేదలకు చేరువ చేసేందుకు కేంద్రం అర్హత నిబంధనలను సరళతరం చేసింది. కుటుంబ నెలసరి ఆదాయ పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచింది. ఇంట్లో ఫ్రిజ్, ద్విచక్ర వాహనం వంటి సాధారణ వస్తువులు ఉన్నా సరే, లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగడానికి ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలు స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు ‘సెల్ఫ్ సర్వే’ సౌకర్యాన్ని కూడా కల్పించారు. రాబోయే రెండు నుంచి మూడు ఏళ్లలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లతో పాటు, కొత్తగా మంజూరైన ఇళ్లను కూడా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top