EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

‘మా టీచర్‌ మాకే కావాలి’ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన!

ఈతరం భారతం ఎర్రుపాలెం ఆగస్ట్ 6

‘ మా టీచర్‌ మాకే కావాలి.. మా పాఠశాలకు సోషల్‌ టీచర్‌ను కొనసాగించాలి’ అంటూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు గురువారం ఆందోళనకు దిగారు.

మండల విద్యాశాఖాధికారి మురళీమోహన్‌రావు వ్యవహారశైలిని నిరసిస్తూ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెం ఉన్నత పాఠశాలలో సోషల్‌ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న స్రవంతిని జనవరి నెల నుంచి రేమిడిచర్ల ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్‌పై కేటాయించారని చెప్పారు. అప్పటి నుంచి ఆమె రేమిడిచర్ల పాఠశాలలో సోషల్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారని పేర్కొన్నారు.

ఇటీవల చేపట్టిన సర్‌ప్లస్‌ ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా స్రవంతికి గతంలో ఇచ్చిన డిప్యూటేషన్‌ కొనసాగుతుండగానే ఆమెను మీనవోలు పాఠశాలకు బయాలజీ ఉపాధ్యాయురాలిగా కేటాయించారని ఆరోపించారు. ఆమె స్థానంలో రేమిడిచర్ల పాఠశాలకు భీమవరం పాఠశాలకు చెందిన సోషల్‌ ఉపాధ్యాయుడిని కేటాయించారని తెలిపారు. సంబంధిత కాంప్లెక్స్‌కు చెందిన ఉపాధ్యాయుడిని కాకుండా మరో పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో ఎంఈఓ ప్రత్యేక చొరవ చూపడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు ఆరోపించారు. రేమిడిచర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అనుమతి తీసుకోకుండానే స్రవంతిని మీనవోలు పాఠశాలకు పంపడంలో ఎంఈఓ పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం స్రవంతి దినసరి హాజరు రేమిడిచర్ల ఉన్నత పాఠశాల రికార్డుల్లోనే నమోదవుతున్నప్పటికీ, తనకు సమాచారం ఇవ్వకుండా మీనవోలు పాఠశాలకు వెళ్లిన నేపథ్యంలో ఆమె ఓడీని ప్రధానోపాధ్యాయుడు ఆమోదించడం లేదని తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం..

ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అన్నారు. రేమిడిచర్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న స్రవంతి ఉపాధ్యాయురాలినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఎంఈఓ మురళీమోహన్‌రావు వివరణ తెలుసుకునేందుకు ఫోన్‌లో సంప్రదించగా ఆయన కాల్‌ కు స్పందించలేదు.

Related News

Select the Topic
Scroll to Top