ఈతరం భారతం హైదరాబాద్, ఆగస్టు 6:
అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్ఏటీజీ)ను సందర్శించి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, కార్యక్రమాలపై అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్ఎస్, తెలంగాణ క్రీడా విధానం, గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలు, ప్రతిభా గుర్తింపు కార్యక్రమాలు, క్రీడాకారుల అభివృద్ధి కార్యాచరణ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక వసతుల కల్పన, ఆధునిక శిక్షణా సౌకర్యాలు, అలాగే రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్న కార్యాచరణను అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రంలో సమగ్ర క్రీడా పర్యావరణ వ్యవస్థ (Sports Ecosystem) ఏర్పాటుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో పరస్పర సహకారంతో క్రీడా అభివృద్ధి, క్రీడాకారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాల కల్పనకు అవసరమైన సహకారం అందించేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
సమావేశం సానుకూల వాతావరణంలో కొనసాగగా, క్రీడా రంగంలో ద్వైపాక్షిక సహకార అవకాశాలను మరింత విస్తరించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో క్రీడా అభివృద్ధికి తోడ్పడే అంశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.















