ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 4 :
_________________________________
రాష్ట్రంలో పది లక్షలకు పైగా జనాభా కలిగిన విశ్వకర్మ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమని విశ్వకర్మ జేఏసీ చైర్మన్ దేవరకొండ కాళిదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయ వృత్తుల ఆధారంగా విశ్వకర్మలను విభజించి చూపడం వల్ల వారి వాస్తవ జనాభా తక్కువగా కనిపిస్తోందని అన్నారు. బీసీ కోటాలో గవర్నర్ కోటా కింద విశ్వకర్మలకు ఎమ్మెల్సీ పదవి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విశ్వకర్మ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
విశ్వకర్మలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయంగా తగిన గుర్తింపు లభించడం లేదని కాళిదాస్ పేర్కొన్నారు. కులవృత్తుల ఆధారంగా విశ్వకర్మలను వేర్వేరు వర్గాలుగా పరిగణించడం వల్ల సమష్టి జనాభా, సామాజిక బలం తెరమరుగవుతున్నాయని అన్నారు. విశ్వకర్మలందరినీ ఒకే సామాజిక సమూహంగా గుర్తించి వారి జనాభా, సమస్యలు, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
పది లక్షలకు పైగా జనాభా ఉన్న సామాజిక వర్గానికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆలోచించాల్సిన అంశమని పేర్కొన్నారు. జనాభా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించకపోతే ఆ వర్గ సమస్యలు ప్రభుత్వాల దృష్టికి ఎలా వస్తాయని ప్రశ్నించారు.బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో విశ్వకర్మలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ముఖ్యంగా గవర్నర్ కోటా కింద బీసీ సామాజిక వర్గానికి కేటాయించే ఎమ్మెల్సీ పదవుల్లో విశ్వకర్మలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విశ్వకర్మల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని కాళిదాస్ పిలుపునిచ్చారు. వృత్తుల ఆధారంగా విడిపోయిన వారంతా సంఘటితమై తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని సూచించారు.అందులో భాగంగా నవంబర్ 14న జేఏసీ ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఎన్నికల్లో విశ్వకర్మ కులానికి చెందిన ఐటీ, డాక్టర్స్, జర్నలిస్ట్,వివిధ రంగాల పెద్దలు, అధికారులను భాగస్వామ్యం చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మలకు రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ కోటాలో సముచిత వాటా సంప్రదాయ వృత్తుల పరిరక్షణ తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పలువురు వెల్లడించారు. విశ్వకర్మల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఐక్యంగా కృషి చేయాలని సమావేశం పిలుపునిచ్చింది.కార్యక్రమం లో విశ్వకర్మ జేఏసీ నాయకులు రవీంద్రాచారి, డాక్టర్ శ్యాం సుందర్ విరశేఖర చారీ లతో పాటు పెద్ద సంఖ్యలో విశ్వకర్మ లు పాల్గొన్నారు.















