ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 4
_______________________________
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో సోమవారం ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది._
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్
భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు: ప్రజలకు, రైతన్నలకు హెచ్చరిక. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగపడే అవకాశం ఉన్నందున ఎలక్ట్రిక్ పోల్స్, చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ కొనసాగనున్న వర్షాలు
కేవలం సోమవారమే కాకుండా, అక్టోబర్ 5 మరియు 6 తేదీల్లో కూడా తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండుమూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం ఇలాగే మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.















