EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు : ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఈతరం భారతం అమరావతి ఆంధ్ర ప్రదేశ్ సెప్టెంబర్ 21 :

___________________________________________

పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు.

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం మైసమ్మ చెరువును సందర్శించిన  పవన్ కళ్యాణ్  వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన గ్యాలరీని సందర్శించారు.

అనంతరం చెరువు గట్టు వెంబడి వాకింగ్ చేస్తూ, అక్కడ ఉన్న భారీ వృక్షాల వయసు, కొన్ని వృక్షాల శాస్త్రీయ నామం తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని తెలిపారు.

చిన్నారులతో కలసి చిల్డ్రన్ పార్కు ప్రారంభోత్సవం

మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు పరిసరాలను పచ్చటి మొక్కలతో అభివృద్ధి చేసి, గట్టును బలోపేతం చేశారు. అనంతరం గట్టుపై వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా వ్యాయామం చేసుకునేలా ఓపెన్ ఎయిర్ జిమ్‌ను, జాతీయ భావన పెంపొందించేలా జెండా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. చెరువు కుడి వైపున పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్కును చిన్నారులతో కలసి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కులో ఆడుకుంటున్న చిన్నారులకు తినుబండారాలు, చాక్లెట్లు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు మోడల్ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు

అంతకుముందు ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువు ప్రారంభోత్సవానికి ముందు గట్టుపై ఉన్న ఆలయంలో శ్రీ మైసమ్మ అమ్మవారిని  పవన్ కళ్యాణ్  దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు మధ్య భాగానికి వచ్చే విధంగా నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఫకృద్ధీన్ పాలెంలోని వినాయకుడి గుడిని సందర్శించారు.

గ్రామస్తులతో మమేకం అవుతూ… గ్రామంలో సౌకర్యాల పరిశీలన

చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ  పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలుకరించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం విడివిడిగా ఏర్పాటు చేసిన కుండీలు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులను పలుకరించి ఫొటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్, కాకినాడ పార్లమెంటు సభ్యులు  తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం శాసన సభ్యులు  నిమ్మకాయల చినరాజప్ప, రాజానగరం శాసన సభ్యులు  బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్  తుమ్మల రామస్వామి, మాజీ శాసన సభ్యులు  పెండెం దొరబాబు, బీజేపీ నాయకులు శ్రీ కృష్ణంరాజు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, పడా పీడీ శ్రీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top