ఈతరం భారతం తిరుపతి, సెప్టెంబర్ 22 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
____________________________________________________
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు, 123 మున్సిపాలిటీల్లో రూ.7,469 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు వర్చువల్ విధానంలో వీక్షించారు. టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు రూ.5,800 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో రూ.206 కోట్ల విలువైన పనులు ప్రారంభమవుతుండగా, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోనే రూ.106 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో నాణ్యమైన రహదారుల నిర్మాణం, సెంట్రల్ మీడియన్ల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, స్ట్రీట్ లైటింగ్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, భద్రతతో కూడిన మెరుగైన పట్టణ వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో పనుల అంచనా వ్యయంలో 40 శాతం నిధులను ప్రభుత్వం ముందస్తుగా సమకూర్చగా, మిగిలిన 60 శాతం మొత్తాన్ని కాంట్రాక్టర్ పెట్టుబడిగా సమకూరుస్తారని కలెక్టర్ వివరించారు. కాంట్రాక్టర్ పెట్టుబడిని ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు వడ్డీతో సహా విడతల వారీగా చెల్లించే విధానం అమల్లో ఉంటుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా పట్టణ మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ తిరుపతి నగర అభివృద్ధికి రూ.106 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయని తెలిపారు. రహదారులు, సెంట్రల్ మీడియన్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, స్వచ్ఛ తిరుపతి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















