EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి పేషెంట్‌ మనకు దైవంతో సమానం  స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్

ఈతరం భారతం తిరుపతి సెప్టెంబర్ 07,రిపోర్టర్ మనోజ్ కుమార్

___________________________________________________

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)కు వచ్చే ప్రతి పేషెంట్‌ను దైవంతో సమానంగా భావించి, వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ అన్నారు.స్విమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సమస్యలతో వస్తుంటారని, అలాంటి సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వారితో సహనంతో, మర్యాదగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

ఆసుపత్రిలో క్రమశిక్షణ, భద్రతను కాపాడటంతో పాటు రోగులకు సరైన మార్గనిర్దేశం చేయడం కూడా సెక్యూరిటీ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత అని డాక్టర్ జగదీష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.స్విమ్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా, భద్రతతో కూడినదిగా ఉండేలా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు.

రోగులు, వారి బంధువులతో అనవసర వాగ్వాదాలకు తావులేకుండా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని చెప్పారు.రోగి ఇక్కడికి వచ్చినప్పుడు తన ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉంటారు. అలాంటి సమయంలో మనం చూపించే చిన్నపాటి ఆప్యాయత, మర్యాద వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రతి పేషెంట్‌ను దైవంతో సమానంగా భావించి సేవ చేయాలి” అని డాక్టర్ గుడారు జగదీష్ సూచించారు.స్విమ్స్‌లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడంతో పాటు రోగులకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

సెక్యూరిటీ సిబ్బంది తమ విధులను కేవలం ఉద్యోగంగా కాకుండా రోగుల సేవలో భాగంగా, సామాజిక బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను డాక్టర్ జగదీష్ అడిగి తెలుసుకున్నారు. రోగుల భద్రత, ఆసుపత్రి క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.స్విమ్స్‌లో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలతో పాటు భద్రత, మర్యాద, మానవీయతతో కూడిన సేవా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డాక్టర్ గుడారు జగదీష్ తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top