EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డిజిటల్ విధానంలో మరో ముందడుగు : యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్

ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 11

పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ఆస్పత్రులు, ఎగ్జామ్ సెంటర్ల వంటి చోట్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకునే విధానానికి బదులుగా యాప్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్ అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా ఆధార్ వివరాలను సురక్షితంగా ఉంచేందుకు, అవసరమైనప్పుడు మాత్రమే సంబంధిత సంస్థలతో పంచుకునే అవకాశం కల్పించారు.ఈ విధానంలో వెరిఫికేషన్ నిర్వహించే సంస్థ ఒక క్యూఆర్ కోడ్‌ను రూపొందిస్తుంది. ఆ కోడ్‌ను కస్టమర్ తన మొబైల్‌తో స్కాన్ చేస్తే పేరు, వయస్సు, మొబైల్ నంబర్, ఫోటో వంటి అవసరమైన వివరాలు మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో ఆధార్ కార్డు ఫోటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు వంటి చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. అయితే ఆ కాపీలు ఇతరుల చేతుల్లోకి వెళితే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. కొందరు వ్యక్తులు ఆధార్ వివరాలను సేకరించి రుణాలు తీసుకోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం వంటి మోసాలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికే ఢిల్లీలో పోలీసులు, హోం గార్డ్స్, జైళ్లు, కోర్టులు, అగ్నిమాపక శాఖలతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. యాప్ ఆధారిత ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేపట్టే సంస్థలు తప్పనిసరిగా UIDAI లో నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.ఈ కొత్త విధానం వల్ల ఆధార్ కాపీల దుర్వినియోగం తగ్గడంతో పాటు, ప్రజల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కస్టమర్ అనుమతితో అవసరమైన సమాచారం మాత్రమే పంచుకునే డిజిటల్ విధానంలో ఇది మరోముందడుగుగా భావిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top