ఇతరంభరతం న్యూఢిల్లీ జూన్ 11
దేశ రక్షణ రంగం, స్వదేశీ తయారీ రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. రక్షణ రంగంలో పూర్తి దేశీయంగా తయారైన తొలి ‘ఎయిర్‌బస్ సీ-295’ సైనిక రవాణ విమానం తన తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో ఈ విమానం సగర్వంగా గగనవిహారం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాకుండా దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ పూర్తి స్థాయిలో సైనిక విమానాన్ని తయారు చేసి, పరీక్షించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దేశ వైమానిక దళ సామర్థ్యాన్ని అమాంతం పెంచనున్న ఈ మెగా ప్రాజెక్ట్ విశేషాలపై ప్రత్యేక కథనం.దేశ రక్షణ రంగాన్ని స్వావలంబన దిశగా నడిపించే దిశగా ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ‘ఎయిర్‌బస్’తో సెప్టెంబర్ 2021లో రక్షణశాఖ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 21 వేల 935 కోట్ల వ్యయంతో 56 సీ-295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 16 విమానాలను స్పెయిన్ నుంచి నేరుగా భారత్‌కు అందిస్తారు. మిగిలిన 40 విమానాలను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్-TASL భాగస్వామ్యంతో వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌లో ఈ విమానాలు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఈ టెస్ట్ ఫ్లైట్ ఎందుకు అంత ముఖ్యం అంటే వడోదర ప్లాంట్ కేవలం విడిభాగాలను అమర్చడమే కాకుండా, విమాన ప్రయాణ పరీక్షల దశకు చేరుకుందని ఇది నిరూపించింది. అంతేకాదు, ఎయిర్‌బస్ సంస్థ ఐరోపా అవతల ఒక పూర్తి స్థాయి సైనిక విమానాన్ని నిర్మించడం కూడా ఇదే ప్రథమం.
ఈ సరికొత్త సీ-295 విమానాలు దేశ వైమానిక దళంలో 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ కాలం చెల్లిన ‘ఆవ్రో HS-748’ విమానాల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఇవి వైమానిక దళానికి వ్యూహాత్మక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి.ఈ విమానం 71మంది పూర్తి స్థాయి సైనికులను లేదా 50 మంది పారాట్రూపర్లను ఒకేసారి మోసుకెళ్లగలదు. దాదాపు 9 టన్నుల బరువైన యుద్ధ సామగ్రిని, కార్గోను సులువుగా తరలిస్తుంది. ఎడారులు, తీర ప్రాంతాలు సహా అత్యంత ఎత్తైన హిమాలయాలు, మంచు ప్రాంతాల్లో ఇది గగనవిహారం చేయగలదు. చాలా చిన్న రన్‌వేల నుంచి కూడా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వగలగడం దీని ప్రత్యేకత. విపత్తు నిర్వహణ, వైద్య సహాయం, సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు వేగంగా బలగాలను తరలించడానికి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడనుంది.















