ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 24
దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు సాధారణ స్థాయి కన్నా 43% తక్కువ ఉన్నాయి. 315 వర్షాభావ ప్రభావిత జిల్లాలకు కేంద్రం అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసింది. ముందస్తు చర్యలు చేపడుతోంది.
వర్షాభావ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఉన్నాయి.
315 జిల్లాల్లో 111 జిల్లాలను అత్యంత ప్రమాదకరంగా గుర్తించింది. ఈ జిల్లాల్లో సాగుభూమిలో 25% కన్నా తక్కువ ప్రాంతానికే నీటిపారుదల సౌకర్యం ఉంది. మరో 76 జిల్లాలను మధ్యస్థ ప్రమాద జాబితాలో చేర్చింది. 128 జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని అంచనా వేసింది.
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అదనపు విత్తన నిల్వలను సిద్ధంగా ఉంచుతోంది. ఎరువుల సరఫరాను పర్యవేక్షిస్తోంది. చెక్‌డ్యాంలు, వ్యవసాయ చెరువులు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. పశుగ్రాస కొరత రాకుండా చర్యలు చేపడుతోంది.
పొలాలను బీడుగా వదిలేయొద్దని రైతులకు సూచిస్తోంది. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు వైపు మళ్లాలని కోరుతోంది. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తోంది.
వర్షాభావ పరిస్థితులు తీవ్రమైతే వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూపొందించిన ఈ ప్రణాళికల్లో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ సాగు విధానాలు, నీటి సంరక్షణ చర్యలను చేర్చారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు కేంద్రం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో గతంలోనూ దేశం కరవు పరిస్థితులను ఎదుర్కొంది. 2002లో వచ్చిన కరవు వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 18% తగ్గింది. వ్యవసాయ రంగ వృద్ధి దాదాపు 7% క్షీణించింది. అయితే ఇప్పుడు నీటిపారుదల సౌకర్యాలు పెరగడం, ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉండటంతో నష్టం గతంతో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది.














