ఈతరం భారతం సెప్టెంబర్ 26 హైదరాబాద్ :ఉస్మానియా విశ్వవిద్యాలయం: విద్యారంగంలో సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాకమిషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యా పరిస్థితులు, సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గాలపై అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అంతకు ముందు పరిపాలనా భవనంలోని పాలకమండలి సమావేశమందిరంలో విద్యా కమిషన్ సభ్యులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంపై సమగ్ర సమాచారాన్ని ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంట పాటు ఓయూ అభివృద్ధి కోసం తాము తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం సహా విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేశారు. మౌళిక వసతుల కల్పన, అధ్యాపకుల నియామకాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం సహా ఓయూను క్లోస్డ్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ కుమార్ వివరించారు.
అనంతరం సెనెట్ హాల్లో జరిగిన బహిరంగ విచారణలో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, ఒప్పంద, పార్ట్ టైం అధ్యాపుకులు, పరిశోధక విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 200 మందికి పైగా పాల్గొన్నారు. ఆయా విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ…30 మందికి పైగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఓయూ బహిరంగ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని… పలు సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు. అన్ని వర్గాలు ఓయూను క్లోస్డ్ క్యాంపస్ గా చేయాలని కోరుకుంటున్నారని… ఇందుకోసం జీహెచ్ఎంసీ సహా ఆయా ప్రభుత్వ విభాగాలతో సమన్యయంతో క్లోస్డ్ క్యాంపస్ దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగిస్తూనే… అధ్యాపకుల నియామకాల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. విద్యార్థులకు హాస్టల్ వసతిపై తీవ్రంగా స్పందించిన కమిషన్…. కోర్సులు పూర్తైన విద్యార్థులు హాస్టల్లను ఖాళీ చేయించే విధంగా త్వరలోనే ఓయూ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలపైన దృష్టి సారించాలని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్ విశ్వేశ్వర్ రావు సూచించారు. విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని… అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే తాము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతామని కమిషన్ సభ్యులు డాక్టర్ చారగొండ వెంకటేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల్లో బహిరంగ విచారణ జరిపామని… త్వరలోనే మహిళా విశ్వవిద్యాలయం సందర్శించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు కమిషన్ సభ్యులు జోత్స్న శివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితెందర్ కుమార్ నాయక్, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, అధ్యాపకులు, విభాగాధిపతులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.















