ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 12:
_________________________________
హైదరాబాద్ నగరంలో ఈనెల 14న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి వెల్లడించారు. మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా 2,200 మంది పోలీస్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు.
408 సీసీ కెమెరాలు, 2 స్పెషల్ డ్రోన్లు..
మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం అంతటా, ప్రేక్షకుల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో 408 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటికి తోడు ఆకాశ మార్గం నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు 2 ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 4 ప్రత్యేక వాచ్ టీమ్లను నిరంతర పహారా కోసం రంగంలోకి దించారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సౌకర్యార్థం దాదాపు 8 వేల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. మ్యాచ్ ప్రారంభ సమయానికి 2 గంటల ముందే స్టేడియం గేట్లను తెరిచి లోపలికి అనుమతి ఇస్తామని సీపీ సుమతి తెలిపారు. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రేక్షకుల సేఫ్టీ విషయంలో అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని, నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె క్రిడాభిమానులను కోరారు.















