EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం

ఈతరం భారతం ఖమ్మం: అక్టోబర్ 12:

______________________________

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఖమ్మంలో కొలువుదీరేందుకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వేదమంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం

ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భూమిపూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టం అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామివారితో కలిసి టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దివ్యదర్శన భాగ్యాన్ని చేరువ చేయడంతో పాటు, సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

20.04 సెంట్ల భూమి కేటాయింపు – ప్రహరీకి రూ.3.40 కోట్లు

ఖమ్మం అర్బన్ మండలం, ధ్వంసలాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 408/2లో తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం 20.04 సెంట్ల భూమిని అల్లిపురం గ్రామంలో కేటాయించింది. ఈ భూమికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది. అవసరమైన నిధులతో ప్రధాన ఆలయ నిర్మాణ పనులను టిటిడి చేపట్టనుంది.

ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం నిర్మాణం

ఖమ్మంలో నిర్మించనున్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం, పోటు (వంటశాల), ప్రాకారం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కావడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక ప్రచారానికి ఈ క్షేత్రం ప్రధాన కేంద్రంగా నిలవనుంది.

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఆధ్యాత్మిక కేంద్రం: శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి

శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు ఖమ్మం ప్రజలకు మంగళాశాసనాలు అందిస్తూ, ఖమ్మం నగరం రెండు తెలుగు రాష్ట్రాలను ఆధ్యాత్మికంగా అనుసంధానించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీనివాసుడి కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అరిష్టాలు తొలగి, పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తయి, ఖమ్మం ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ కృషి: చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలనే సంకల్పంతో టీటీడీ ముందుకు సాగుతోందని తెలిపారు. హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాలు దోహదపడతాయన్నారు. ఆలయ నిర్మాణంలో భక్తుల భాగస్వామ్యం, విరాళాల ప్రాధాన్యాన్ని వివరించారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయాలు కీలకం: మంత్రి శ్రీ తుమ్మల

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన చిన్నజీయర్ స్వామివారికి, సహకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. దేవదేవుడి ఆశీస్సులతో నిర్మితమయ్యే ఈ ఆలయం ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, ఎస్‌ఈ ఇన్‌ఛార్జి శ్రీ ఎస్. ప్రసాద్, డీఈ శ్రీ సురేంద్ర నాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మల్లికార్జున, అర్చకులు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top