ముంబై/ హైదరాబాదు సెప్టెంబర్ 30 (ఈతరం భారతం); తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువకులు క్రికెట్ క్రీడలో విశేష ప్రతిభను కనబరుస్తున్నా, వారికి సరైన గుర్తింపు లభించడం లేదు. ఈ పరిస్థితికి పరిష్కారం చూపాలని, తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐ నూతన అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌ను టిడిసిఏ అధ్యక్షుడు, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ క్రికెట్ కు చారిత్రక అన్యాయం
తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి 90 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలోనే సాగుతోంది. నిజాం కాలంలో ఏర్పడిన ఈ సంఘంలో ప్రస్తుతం 200కి పైగా క్లబ్బులు ఉన్నప్పటికీ, వాటిలో 190కి పైగా క్లబ్బులు హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యాయి. మిగిలిన తెలంగాణ ప్రాంతానికి మాత్రం కేవలం పది క్లబ్బులు మాత్రమే ఉన్నా, వారికి సరైన అవకాశాలు, గుర్తింపు లభించలేదని వెంకటేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దేశంలోని అత్యధిక అవినీతి కేసులు ఎదుర్కొంటున్న క్రికెట్ సంఘంగా నిలిచిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆటగాళ్ల ఎంపికల నుండి ఉప్పల్ స్టేడియం నిర్మాణం, నిర్వహణ వరకు అనేక కాంట్రాక్టులు అవినీతి మయం అయ్యాయని, మాజీ కార్యదర్శులు, అధ్యక్షులపై అనేక కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ గ్రామీణ క్రికెట్ అభివృద్ధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానం
గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర, గుజరాత్, బరోడా అనే మూడు వేర్వేరు సంఘాలకు బీసీసీఐ గుర్తింపు ఇచ్చింది. మహారాష్ట్రలో బొంబాయి, విదర్భ, మహారాష్ట్ర అనే మూడు సంఘాలు కూడా గుర్తింపు పొందాయి. అంతేకాకుండా పంజాబ్ రాష్ట్రంలో రెండు సంఘాలు, చండీగఢ్ క్రికెట్ సంఘానికి కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా HCA మాత్రమే కొనసాగి, తెలంగాణ గ్రామీణ క్రికెట్‌కు గుర్తింపు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ గ్రామీణ క్రికెట్‌కు గుర్తింపు అవసరం
తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన జిల్లా క్రికెట్ సంఘాలు ఇంకా ఏర్పాటు కాలేదు. గత తొమ్మిది సంవత్సరాలలో రంజీ ట్రోఫీకి గ్రామీణ ప్రాంతాల నుండి ఒక్క ఆటగాడికీ అవకాశం రాకపోవడం, IPL లో కూడా ఒక్క గ్రామీణ ప్రతిభావంతుడికి స్థానం లభించకపోవడం ఈ అన్యాయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
* టీడీసీఏకు గుర్తింపునివ్వండి
తెలంగాణలో గ్రామీణ క్రికెట్ ప్రతిభకు కావలసిన గుర్తింపు ఇవ్వాలంటే TDCA వంటి సంఘాలకు అధికారిక గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలోని యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే వారిని ప్రోత్సహించే వేదికలు, అవకాశాలు ఏర్పడాలి. కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమైన HCA ఆధీనంలో ఇది సాధ్యం కాదని అనుభవం చూపిస్తోంది. కాబట్టి, తెలంగాణ గ్రామీణ క్రికెట్‌ను కాపాడటానికి, అభివృద్ధి చేయటానికి బీసీసీఐ తక్షణమే చర్యలు తీసుకోవాలి.















