హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ఈతరం భారతం);తెలంగాణ తల్లి పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.శుక్రవారం ఆయన రాష్ట్ర బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలకు సాధ్యపడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని సమైక్యతా దినోత్సవంగా మార్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం పేరిట తప్పించుకుంటోంది. వీరంతా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, వేలాది అమరవీరుల త్యాగాలను అవమానపరుస్తున్నారు” అని అన్నారు.సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యం ఐదు రోజుల్లోనే ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్లను ఓడించి, తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిందని గుర్తుచేశారు. “అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలి” అని స్పష్టం చేశారు.కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్–బీఆర్ఎస్ దానిని దాచిపెడుతున్నాయని ఆరోపించారు.“తల్లిని కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలను ప్రజలు గుర్తించారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను బొందపెట్టాలి. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా అధికారికంగా నిర్వహిస్తాం” అని డా. బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.















