ఈతరం భారతం భాగ్యనగరం ఏప్రిల్ 8
వాట్సప్ వినియోగదారులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న అద్భుతమైన ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఇతరులకు మీ ఫోన్ నంబర్ తెలియకుండానే వారితో సందేశాలు పంపడం లేదా కాల్స్ మాట్లాడటం సాధ్యమవుతుంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ వాట్సప్ ఈ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసింది.సాధారణంగా వాట్సప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకంటూ ఒక ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అవతలి వారికి మీ యూజర్‌నేమ్ చెబితే సరిపోతుంది, మీ ఫోన్ నంబర్ వారికి కనిపించదు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి రాగా, దశలవారీగా అందరికీ అందుబాటులోకి రానుంది.
మీ వాట్సప్ యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది:
అక్షరాల పరిమితి: యూజర్‌నేమ్ కనీసం 3 నుండి గరిష్టంగా 35 అక్షరాల వరకు ఉండాలి.
ఏమి వాడవచ్చు?: అక్షరాలు (A-Z), అంకెలు (0-9), డాట్ (.), మరియు అండర్‌స్కోర్ (_) మాత్రమే ఉపయోగించాలి.
మెటా లింకింగ్: ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో వాడుతున్న యూజర్‌నేమ్‌నే వాట్సప్‌లో కూడా వాడాలనుకుంటే, మీ ఖాతాలను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా చెక్ చేసుకోవాలి?
ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మీ వాట్సప్ Settings > Profile విభాగంలోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. అక్కడ పేరు మరియు అబౌట్ (About) విభాగాల మధ్యలో కొత్తగా ‘Username‘ ఆప్షన్ కనిపిస్తుంది.















