ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 18
_________________________________
హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన కేసులో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించారన్నది ఏసీబీ ప్రధాన ఆరోపణ. ఈ లావాదేవీల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, అవసరమైన అనుమతులు తీసుకోలేదని ఏసీబీ తన ఛార్జిషీట్లో స్పష్టం చేసిందిఈ కేసులో కేటీఆర్ ఏ-1గా ఉండగా, మాజీ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ-2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి ఏ-3గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఏ-4గా ఉన్నారు. గతంలో వ్యక్తిగత కారణాలతో విచారణకు గైర్హాజరైన కేటీఆర్, ఈసారి మాత్రం కోర్టుకు హాజరై తన బాధ్యతను నిర్వర్తించారు.కోర్టులో విచారణ అనంతరం కేటీఆర్ తరఫు న్యాయవాది మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో కీలకమైన విదేశీ సంస్థకు ఇప్పటివరకు సమన్లు అందలేదని, దీనివల్ల విచారణ ముందుకు సాగడం లేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, విచారణను అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. విదేశీ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపేందుకు అనుమతించాలని కోరుతూ తాము పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో తాము దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు వెనక్కి పంపిన నేపథ్యంలో, మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులందరూ కోర్టుకు హాజరు కావడంతో, తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.















