ఈతరం భారతం అక్టోబరు 13 హైదరాబాద్: సైదాబాద్ జైల్ గార్డెన్‌లోని ప్రభుత్వ వీధి బాలుర గృహంలో ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు రెహమాన్ లైంగిక దాడి చేశాడు. బాధితుల్లోని ఓ బాలుడి తల్లి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా పండగకి ఇంటికి వచ్చి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని ఓ చిన్నారి తల్లి వద్ద భోరున విలపించాడు. ఆరా తీయడంతో.. విషయం తెలిసింది. జువెనైల్ హోంలో సంరక్షకుడే అభంశుభం తెలియని బాలురపై అసహజరీతిలో తరచూ లైంగికదాడికి పాల్పడ్డాడు. మొదట బాధితుడు ఒక్కడే అనుకున్నారు.. పోలీసులు కూపీ లాగితే మరో అయిదుగురిపైనా లైంగిక దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు వైద్యుల పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధరణ అయింది. మిగిలిన ఐదుగురు మైనర్లకు కూడా పోలీసులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. ప్రస్తుతం నిందితుడు రెహమాన్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.















