ఈతరంభరతం( స్తంభాద్రి )ఖమ్మం/ కూసుమంచి, సెప్టెంబర్ -09:అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంగళవారం పాలేరు నియోజకవర్గంలో మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. నర్సింహులగూడెం గ్రామంలో కిష్టాపురం నుండి నర్సింహులగూడెం వరకు రూ. 1.33 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు, కిష్టాపురం నుండి పోచారం వరకు రూ. 1.61 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, కిష్టాపురం నుంచి ముత్యాలగూడెం వరకు రూ. 2.40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.జుజ్జులరావుపేట గ్రామంలో రూ. 88 లక్షలతో జుజ్జులరావుపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి మల్లాయిగూడెం పిఆర్ రోడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కిష్టాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మామిడి నాగమ్మ ఇందిరమ్మ ఇంటిని మంత్రి పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇసుక ఇస్తున్నారా, మొదటి విడత లక్ష రూపాయలు జమ అయ్యాయా అని లబ్దిదారుని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయి క్రమంలో విడతల వారిగా 5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు.కూసుమంచి జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
కూసుమంచి తహసిల్దార్ కార్యాలయంలో శాండ్ బజార్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక అందించాలని సదుద్దేశంతో ఒక టన్ను గోదావరి ఇసుకను రూ. 1100 కే అందించనున్నట్లు మంత్రి తెలిపారు. స్థానికులకు ఇతర అవసరాలకు టన్ను ఇసుక రూ. 1300కి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఎక్కడా తప్పులు జరగకుండా అధికారులు పనిచేయాలని, చిన్న తప్పు జరిగిన ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు.కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి మండలంలో 42, ఖమ్మం రూరల్ మండలంలో 82 మొత్తం 124 మంది లబ్ధిదారులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ, కూసుమంచి మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 20 మంది క్రైస్తవ మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎనిమిది లక్షల పందొమ్మిది వేల కోట్ల అప్పు రాష్ట్రంపై మోపిందని తెలిపారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామని అన్నారు. రైతులకు మద్దతుగా 21 వేల కోట్లతో 2 లక్షల వరకు పంట రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ, క్వింటా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు సమస్యలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించి 7 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు, రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు చేశామన్నారు. పేదలకు అండగా ఉండే మన ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని అన్నారు. నియోజకకగానికి 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు, త్వరలో రెండో విడత ఇస్తామని అన్నారు. విడతల వారిగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని మంత్రి అన్నారు.పేదవారికి కష్టం కలగకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ, పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నెరవేర్చుతుందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్ అండ్ బి ఇఇ పవార్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, కూసుమంచి మండల తహసీల్దార్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారిణి వాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.















