యాదగిరిగుట్ట ,సెప్టెంబర్ 1 (ఈతరం భారతం);: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి దాతల సహకారం కోసం … సంఘం అధ్యక్షుడిగా దేవస్థానం ఉద్యోగుల ప్రయోజనాల కోసం … జేఏసీ చైర్మన్ గా రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల కోసం పాటుపడటం… ఇలా బహుముఖంగా పనిచేసి సహాయ కార్య నిర్వహణ అధికారిక గా (ఏఈఓ )గజవెల్లి రమేష్ బాబు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం ఉద్యోగిగా మాత్రమే పదవీ విరమణ చెందానని … తమ ఇలవేల్పు అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో జీవితాంతం తరిస్తూనే ఉంటానని అన్నారు.
ఎన్ ఎం ఆర్ స్థాయి నుంచి…
1986లో నాన్ _మస్టర్ రోల్ ( ఎన్ ఎం ఆర్ )ఉద్యోగిగా తన సేవలను ప్రారంభించిన గజవెల్లి రమేష్ బాబు పదవీ విరమణ చేసే సమయానికి (31/8/2025) దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారి ( ఏఈఓ ) గా… రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గా ఉన్నారు.. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో సన్మానాలు ,సత్కారాలు అందుకున్నారు.. నిగర్వి, మృదుభాషి ,సదా సాటి ఉద్యోగస్తుల కోసం నిరంతర కృషి ఆయన నైజం.
టీఎన్జీవోల సంఘంలో విలీనం…
దేవాలయాల ఉద్యోగులను టీఎన్జీవోల సంఘంలో విలీనం చేయడంలో రమేష్ బాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అప్పటి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు స్వామి గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా టీజేఎసి నాయకుడు మందడి ఉపేందర్ రెడ్డి ఈ విషయంలో తనకు సహకరించారని తెలిపారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ ఉద్యోగులకు పిఆర్సి, కారుణ్య నియామకాల జీవో సాధించడంలో ఆయన కృత కృతుడయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సకలజనుల సమ్మెలో రాష్ట్రం లోని దేవస్థానం ఉద్యోగస్తులను ఉద్యమ బాటలో నడిపించారు. కాగడాల ప్రదర్శన, సుదర్శన హోమం వంటి ఉద్యమాలు నడిపించారు. ఆయన ప్రతిభాపాటవాలను గుర్తించిన రాష్ట్ర టిఎన్జీవోల సంఘం వారు తమ సెంట్రల్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా గజవెల్లి రమేష్ బాబుకు సముచిత స్థానం కల్పించి గౌరవించింది. రాష్ట్ర సాధన అనంతరం రెండు వేతన సవరణలు ( పి ఆర్ సి) సమకూరాయని, అలాగే గత సంవత్సరం జూలై నుంచి మరొక పి ఆర్ సి రావాల్సి ఉందని అన్నారు. దేవస్థాన ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.
ఎన్ఎంఆర్ ల క్రమబద్దీకరణ….
శ్రమైక జీవన సౌందర్యం… కృషితో నాస్తి దుర్భిక్షం… అని నమ్మే గజవెల్లి రమేష్ బాబు యాదగిరిగుట్ట దేవస్థానంలో 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న 42 మంది ఎన్ ఎన్ ఆర్ లను క్రమబద్ధీకరించడంలో సఫలీకృతుడయ్యాడు. ఉద్యోగాలు చేస్తూ కన్ను మూసిన ఎంఎంఆర్ ల పక్షాన ఉద్యోగంలో చేరిన వారి క్రమబద్ధీకరణ ఇంకా జరగాల్సి ఉందన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహుని సేవలో….
ఒకవైపు ఉద్యోగస్తుడిగా పని చేస్తూనే… మరోవైపు దేవస్థానం అభివృద్ధిలో భాగంగా భక్తులు, యాత్రికుల వసతి సౌకర్యం కోసం గదులు, కాటేజీల నిర్మాణం కోసం దాతల అన్వేషణలో ఇతర ఉద్యోగస్తులతో పాటు రమేష్ బాబు చేసిన కృషి మరువలేనిది అంటారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని యాదగిరిగుట్ట దేవస్థానంలో విలీనం చేయడంలో ఆయన ఎంతగానో పాటుపడ్డారు. ఫలితంగా అక్కడ పనిచేసే దేవస్థాన ఉద్యోగులకు ప్రయోజనాలు సమకూరాయని …దేవస్థానం కూడా క్రమంగా అభివృద్ధి చెందేందుకు దోహద పడిందని… కేడర్ స్ట్రెంత్ సాధించి తీసుకురావడంతో ఉద్యోగస్తులందరికీ ప్రయోజనాలు.. ఉద్యోగ ఫలాలు అందినాయని పలువురు ఉద్యోగస్తులు ఆయనను ఎంతగానో కొనియాడారు. మస్కట్లో (విదేశం )శ్రీ స్వామివారి కల్యాణోత్సవ నిర్వహణకు కృషిచేసి అక్కడికి వెళ్లి అందులో పాల్గొన్నారు… భద్రాచలం, శ్రీశైలం వంటి దేవస్థానం జాతరలలో… విశేష ఉత్సవాలలో ఆయన ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించారు.
సహకారం మరువలేనిది…
పదవీ విరమణ సందర్భంగా గజవెల్లి రమేష్ బాబు దంపతులను ఉన్నతాధికారులు, సహ ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించారు. ఒక ఉద్యోగస్తుడిగా, రాష్ట్ర జేఏసీ చైర్మన్ గా తనకు సహకరించిన ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ తదితర ఉన్నతాధికారులకు, ధర్మకర్తలకు ,సహ ఉద్యోగులకు, స్నేహితులకు సదా రుణపడి ఉంటానని గజవెల్లి రమేష్ బాబు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలుతెలిపారు.















