యాదగిరిగుట్ట,ఆగస్టు 28 (ఈ తరం భారతం);: బిజెపి పాలన కోసం గ్రామాల ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బిజెపి సత్తా చాటుతుందని అన్నారు. దేశంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీల్లో బిజెపి అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలోని పట్టణాలలో ఇతర పార్టీలకన్నా బిజెపికి అత్యధిక ఓట్లు వచ్చాయన్నారు. అంతేకాకుండా మేజర్ గ్రామపంచాయతీలో కూడా తమ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎంపీపీ, మున్సిపల్, గ్రామపంచాయతీ.. ఎన్నికలు ఏవైనా సరే బిజెపిదే హవా అని అన్నారు. దేశ విదేశాలలో త్వరితగతిన ప్రధాని నరేంద్ర మోడీ హవా ఎలా పెరుగుతూ వచ్చిందో… అలాగే దేశంలోనూ బిజెపికి ప్రజాదరణ పెరుగుతూ వస్తోందని.. అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దీన్ని సూచిస్తున్నాయన్నారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయి కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకుంటూ వస్తుందని రచ్చ శ్రీనివాస్ అన్నారు. ప్రజలలో రాజకీయ పరిణితి గణనీయంగా పెరిగిందని.. రేషన్ సరఫరాతో సహా ఏ పథకం తీసుకున్నా అందులో సింహభాగం నిధులు కేంద్రానివే నని ప్రజలు గుర్తించడం ప్రారంభమైందని…. కేంద్ర పథకాలకు కాంగ్రెస్ ముసుగు తొడిగే ప్రయత్నాన్ని ప్రజలు ఈసడించు కుంటున్నారని చెప్పారు. కేంద్ర పథకాలన్నీకూడా గ్రామీణ ప్రజల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండటంతో… ఇప్పటివరకు టిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు ఇక బిజెపి పరిపాలన కోసం గ్రామీణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు.
గుట్టలో మూడు వాటర్ ట్యాంకులు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర బిజెపి ప్రభుత్వ నిధులతోనే మూడు మంచినీటి ట్యాంకులు నిర్మాణం కాబోతున్నాయని రచ్చ శ్రీనివాస్ తెలిపారు. గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు రాష్ట్రం కేంద్రం పైన పూర్తిగా ఆధారపడి ఉందన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు , కార్మికులు ఇలా అందరి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వానివేనని అన్నారు. విద్య, వైద్యరంగ అభివృద్ధికి బిజెపి చేస్తున్న కృషిని ప్రజలు క్రమంగా గుర్తించడం ప్రారంభించారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడాన్ని బిజెపి సహించదన్నారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను బిజెపి ఎంపిక చేయటం అందరికీ తెలిసిందే అన్నారు.
ఆలేరులో కమలవికాసమే
ఆలేరు నియోజకవర్గంలో నియోజకవర్గం ,మండలం ,పట్టణం ,గ్రామీణ స్థాయిలోనూ బిజెపి సంస్థాగతంగా బలోపేతంగా ఉందని రచ్చ శ్రీనివాస్ అన్నారు. ప్రతి సమస్య పైన పోరాడే బిజెపి శ్రేణులను చూసి ఇతర పార్టీలు జంకుతున్నాయన్నారు. తమ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం తమ బిజెపికి ప్రధాన ఆకర్షణ అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని, సొంతంగానే అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకో సత్తా ఉందని స్పష్టం చేశారు.
రాయగిరి స్టేషన్ అభివృద్ధి
2016_ 17లో రూ. 330 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఘట్కేసర్ నుండి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగించే ప్రాజెక్టు కాస్త గత టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ,అసమర్థత కారణంగా కాలయాపన జరిగిందని రచ్చ శ్రీనివాస్ అన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వమే అమృత్ భారత్ పథకం కింద… పెరిగిన అంచనా వ్యయంతో సొంతంగానే ఎంఎంటీఎస్ రైలు రాయగిరి వరకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తోందన్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్ గా నామకరణం పొందిన రాయగిరి రైల్వే స్టేషన్ ను దాదాపు 25 కోట్లతో ఆధునికరిస్తున్న పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. పనులు పూర్తయితే సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్టకు కేవలం 20 రూపాయల టికెట్ తో యాత్రికులు వచ్చే వీలు కలుగుతుందన్నారు.















