ఈతరం భారతం సెప్టెంబర్ 16 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు మండలం కొలనుపాక శ్రీ మాతా పితృ గోక్షేత్రంలో జరుగుతున్న భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఏడు రోజులపాటు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రిత్వికుల పర్యవేక్షణలో యాగనిర్వహణ జరిగింది.
బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష కుమార శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. హైదరాబాద్ కు చెందిన బాలవిహార్ – దేవీ గ్రూప్ ఆధ్వర్యంలో గీతా పారాయణం జరిగింది. పులి సీతారామ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు భాగవత మూల పారాయణం చేశారు. గోక్షేత్రం అధ్యక్షులు బిజుమల్ల బిందు మాధవ శర్మ జ్ఞాన యజ్ఞ పర్యవేక్షణ జరిపారు. భక్తుల ఆధ్వర్యంలో భాగవత పఠనం, భజన గీతాలాపన, కార్తీక భాగవతార్ ఆధ్వర్యంలో భజన సంప్రదాయంలో రాధా కళ్యాణం కార్యక్రమాలు జరిగాయి. పేద పండిత సత్కారం జరిగింది. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పలు ప్రాంతాల నుండి, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణం, మానవ వికాస పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం సశాస్త్రీయంగా, విజయవంతంగా జరిగి ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.















