ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 17
———————————————–
రవీంద్ర భారతి:నిరాడంబరత, నిర్భీతితో సమాజాన్ని ప్రభావితం చేసిన కవిత్వాన్ని అందించిన కవిత్వాగ్నికణం మహాకవి కాళోజీ అని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. రవీంద్ర భారతి లోని తన కార్యాలయంలో శనివారం ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ సంపాదకత్వంలో 74 మంది కవుల కవితలతో రూపొందిన ‘కవితాగ్ని గోళం కాళోజీ’ కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని, సామాజిక కోణాలను స్పృశించి కవిత్వాన్ని సజీవ ప్రవాహినిగా ఉరకలెత్తించిన కవుల పరంపర కాళోజీది అని ఆయన చెప్పారు. రాయాలనుకున్నది అనితర సాధ్యంగా రాసేసి, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసిన ప్రజాకవి కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని సంస్మరిస్తూ కవులు ఈ సంకలనంలో కవితలను రాశారని ఆయన తెలిపారు. సామాజిక స్పృహ ఉన్నంతకాలం కాళోజీ కాలాతీతుడైన కవిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు మౌనశ్రీ మల్లిక్, నామాల రవీంద్ర సూరి, కడియాల ప్రభాకర్ రావు, మిద్దె సురేష్, డాక్టర్ బోనాల ప్రకాష్, సుతారపు వెంకట్ నారాయణ, ప్రముఖ గాయకులు దేవత సుధాకర్, మద్దూరి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.














