ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 7
తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి మరో భారీ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బిగ్ రిలీఫ్ కల్పించనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో భారీ నియామక ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 1,501 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
ఈ నియామకాల్లో అత్యధికంగా 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) పోస్టులు ఉండగా.. 108 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె పోలీస్ ఎస్సైలు, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదలచేసింది.
అటవీ శాఖతో పాటు స్టాటిస్టిక్స్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం పోలీస్ నియామక పరీక్షలతోపాటు.. నవంబర్‌లో జరగనున్న యూపీఎస్సీ పరీక్షలు.. ఆ తర్వాత పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే గ్రూప్స్, ఈఏపీసీఈటీ వంటి ప్రధాన పరీక్షల షెడ్యూళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ ఉద్యోగాల తేదీలను నిర్ణయించే అవకాశం ఉంది. పరీక్షలు ఒకదానితో మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికతో షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎఫ్‌బీఓ పోస్టులకు ఇంటర్ అర్హత..
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విద్యార్హత, వయోపరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు ఫీజు, జీతభత్యాలు వంటి పూర్తి వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామక ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉండే అవకాశం ఉంది.
కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) రాత పరీక్ష.. ఫిజికల్ మెజూర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్. రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత శారీరక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పురుష అభ్యర్థులు 4 గంటల్లో 25 కిలోమీటర్లు.. మహిళా అభ్యర్థులు 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడిచి ఫిజికల్ టెస్ట్ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది















